నల్లజర్ల మండలంలో పులిసంచారం

Jan 29,2024 15:49 #East Godavari, #Tiger
beware of tiger in your area
  •  పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు

ప్రజాశక్తి- నల్లజర్ల(తూర్పుగోదావరి) : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేశారు. అయ్యవరం గ్రామంలోని సబ్‌స్టేషన్‌ సమీపంలో కోకో తోట ఉంది. ఈ తోటలో పులి సంచరించినట్లుగా ఫారెస్ట్‌ అధికారుల బృందం నిర్ధారించింది. తోటలో పులి పాదముద్రలను గుర్తించామని, తాము చెప్పేవరకూ ఎవరూ పొలాల్లోకి వెళ్లొద్దని వారు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు వలంటీర్లను అప్రమత్తం చేశారు. అటవీప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అయ్యవరం, ముసుళ్లకుంట, దూబచర్ల, ఘంటావారిగూడెం, పుల్లలపాడు, చీపురుగూడెం గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. ఈ పులి తిరిగి అడవిలోకి వెళ్లిపోతున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉందన్నారు.

➡️