గ్రామాల్లో భగత్‌సింగ్‌ వర్థంతి : ఎపి రైతు సంఘాలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా పేర్కొంటూ భగత్‌సింగ్‌ వర్థంతి నిర్వహించాలని ఎపి రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు కోరారు. సోమవారం విజయవాడలోని ఎంబివికెలో రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన యువ కిశోరాలు షహీద్‌ భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ అమరుల దినోత్సవాన్ని గ్రామ గ్రామాన నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బడా కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు దోచిపెట్టేందుకు అనుకూల చట్టాలను అమలు చేసే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యావత్తు ప్రజానీకం పోరాడాలన్నారు. లఖింపూర్‌ఖేరీ ఘటనకు ప్రధాన సూత్రధారి అయిన అజరుమిశ్రాకు ఖేరీ ఎంపి అభ్యర్థిగా సీటు ఇచ్చారని, అతనిని ఓడించేందుకు కృషి చేయాలని కోరారు. ఎలక్టోరల్‌ బాండ్లు అతిపెద్ద కుంభకోణమని, ఈ ఎన్నికల్లో బాండ్ల ద్వారా బిజెపి నిధులు సమకూర్చుకుందని విమర్శించారు. దీనిపై విచారణ జరపాలని కోరారు. ఢిల్లీ నిరసనల్లో 400 మంది రైతులను మానసికంగా, శారీరకంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడ్డ, ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రైతు నాయకులను గృహ నిర్బంధం చేశారని, రైళ్లు సకాలంలో నడపకుండా ఆలస్యం చేసేలా కేంద్రం కుట్ర చేసిందని విమర్శించారు. రైతు నాయకులు కెవివి ప్రసాద్‌ మాట్లాడుతూ.. డబ్బు, అధికారం, కండబలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. రైతులకు ఆహార పానియాలు అందకుండా తీవ్ర హింసకు గురిచేశారని పేర్కొన్నారు. ఢిల్లీ రైతు ఉద్యమానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు సుబ్బరావమ్మ, ఐఎఫ్‌టియు నాయకులు పొలారి, ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి ఎం హరిబాబు, జమలయ్య, సింహాద్రి ఝాన్సీ, డి హరినాథ్‌, ఆంజనేయులు, మరీదు ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️