భగవద్గీత పేరుతో స్వార్థప్రయోజనాలు ప్రచారం : ఎంవిఎస్‌ శర్మ

bhagavatgeetha oka avalokana book release

 

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : భగవద్గీత భారతీయ సంస్కృతిలోని వివిధ మత భావనలను క్రోడీకరించిన గ్రంథమని మాజీ శాసనమండలి సభ్యులు, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎంవిఎస్‌ శర్మ అన్నారు. 34వ విజయవాడ పుస్తక మహోత్సవం ఏడో రోజు బుధవారం కేతు విశ్వనాధరెడ్డి సాహిత్య వేదికపై విశాలాంధ్ర వారి పుస్తకావిష్కరణ సభను నిర్వహించారు. ‘భగవద్గీత- ఒక అవలోకన’ గ్రంథాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీతను భగవంతుని వాక్కుగా కాకుండా ఒక చారిత్రక ఆధారంగా పరిశీలించాలని సూచించారు. సనాతనధర్మం, భగవద్గీత ఒకటే బోధించాయనే విషయం పూర్తిగా నిజం కాదన్నారు. భూస్వామ్య వ్యవస్థ మొదలైన తొలినాళ్లల్లో అప్పటికే అమలులో ఉన్న గణతంత్ర, సమిష్టి భావనలకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థను బలపరిచేందుకు భగవద్గీత అవసరమయ్యిందన్నారు. మారుతున్న కాలంతో పాటు, ధర్మాలు కూడా మారుతూంటాయి కనుక భగవద్గీతను అదే దృష్టితో చూడాలని తెలిపారు. ప్రస్తుతం ఒక మతం ప్రయోజనం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం భగవద్గీతను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు విపరీతమైన ప్రయత్నం జరుగుతోందన్నారు. భగవద్గీత పేరుతో సమాజంలోని అసమానతలను దేవుడే సృష్టించాడని చెప్పడం అన్యాయమని తెలిపారు. అలాగే పని మీదే కానీ ఫలితం మీద ఆశలు వదులుకోవాలని చెప్పడం కూడా తగదన్నారు. అనంతరం ‘అరుణ తారలు’ పుస్తకాన్ని ప్రజానాట్యమండలి గౌరవ సలహాదారు నల్లూరు వెంకటేశ్వర్లు, ‘పెరియార్‌ ఇ. వి. రామస్వామి నాయకర్‌ రాజకీయజీవితం’ పుస్తకాన్ని విశాలాంధ్ర విజ్ఞాన సమితి కోశాధికారి జి. ఓబులేసు, రెంటాల శ్రీనివాసరావు అనువదించిన ‘భారతీయ నాస్తికవాదం’ పుస్తకాన్ని విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్‌ మేనేజర్‌ పి. హరనాథ్‌ రెడ్డి ఆవిష్కరించారు. సమితి సంపాదకులు గడ్డం కోటేశ్వరరావు సభకు అధ్యక్షత వహించగా విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ మేనేజరు మనోహర్‌ నాయుడు పాల్గొన్నారు.

➡️