రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దుకు బిజెపి కుట్ర

Apr 17,2024 21:45 #2024 elections, #Araku, #cpm raly
  • సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి అప్పలనర్స
  • 19 నామినేషన్‌ దాఖలు
  •  పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాక

ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్‌, పాలకొండ : భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గిరిజనుల హక్కులను, చట్టాలను, రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బిజెపి కుట్ర పన్నుతోందని సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పి.అప్పలనర్స అన్నారు. పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలోనూ, సీతంపేట మండల కేంద్రంలో నిర్వహించిన పరిచయ సభలోనూ ఆయన మాట్లాడారు. పాలకొండలో ఆర్‌టిసి కాంప్లెక్స్‌ ఆవరణ నుంచి ఏలం జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో అభ్యర్థితోపాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ, సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి, పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, నాయకులు కె.నాగమణి, కె.మోహన్‌రావు. సిహెచ్‌ అమ్మన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పలనర్స మాట్లాడుతూ.. బిజెపి మూడోసారి అధికారం చేపడితే ఇప్పుడున్న భారత రాజ్యాంగం కన్నా భిన్నమైన రాజ్యాంగం అమలు చేస్తామని ఆ పార్టీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తుండడం దేశ ద్రోహచర్య అని విమర్శించారు. భిన్నత్వంలో ఏకత్వం గల మన దేశంలో బిజెపి పూర్తిగా మైనార్టీ కులాలను, మతాలను ధ్వంసం చేస్తూ ఒకే కులం.. ఒకే మతం అజెండాగా పని చేస్తోందని తెలిపారు.
1/70 చట్టం, రిజర్వేషన్లు, అటవీ హక్కుల చట్టం, గ్రామ సభలకు ఉన్న అధికారాన్ని బిజెపి కాలరాసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అటవీ హక్కుల పరిరక్షణ చట్టాన్ని రద్దు చేసి ఏజెన్సీలోని గనులను అదానీ, అంబానీలకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందన్నారు. ఇప్పటికే సాలూరు, అరకు ప్రాంతాల్లో ఎనిమిది హైడ్రోజన్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణానికి అనుమతులతో పనులు చేపడుతోందని తెలిపారు. గిరిజనుల అభివృద్ధి పట్ల బిజెపి, వైసిపి, టిడిపి, జనసేనకు ఎటువంటి చిత్తశుద్దీ లేదన్నారు. ప్రజాసమస్యలపై పనిచేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రానికి అన్ని విధాలా ద్రోహం చేసిన బిజెపితో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు జతకట్టడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన పోరాడుతున్న ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి అప్పలనర్సను గెలిపించాలని కోరారు.
నామినేషన్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అరకు పార్లమెంటు అభ్యర్థి పి.అప్పలనర్స ఈ నెల 19న నామినేషన్‌ వేస్తారని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డివేణు తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పాతబస్టాండ్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించి, అనంతరం కలెక్టరేట్‌ వరకు ప్రదర్శనగా చేరుకొని నామినేషన్‌ వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. కార్మికులు, కర్షకులు, గిరిజనులు, మేధావులు, అభ్యుదయవాదులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

➡️