పోలవరం నిర్వాసితులను ముంచిన బిజెపి, టిడిపి, వైసిపి

May 10,2024 22:15 #cpm v srinivasarao, #press meet

– ఈ ఎన్నికల్లో వారికి బుద్ధిచెప్పండి : వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి – చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా):పోలవరం నిర్వాసితులను నిండా ముంచేసి బిజెపి, టిడిపి, వైసిపిలు కాంట్రాక్టర్ల జేబులు నింపాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. అల్లూరి జిల్లా చింతూరులోని సిపిఎం కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. పోలవరం నిర్వాసిత మండలాలైన విఆర్‌.పురం, కూనవరం, చింతూరు, ఎటపాక, వేలేరుపాడు, కుక్కునూరులో ఎకరాకు ఐదు లక్షల రూపాయల అదనపు పరిహారం ఇప్పిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ మాట తప్పి మడమ తిప్పారన్నారు. పోలవరం నిర్వాసితుల పరిహారం విషయంలో కేంద్రంతో మాట్లాడి ఆయన సాధించిందేమీ లేదన్నారు. ప్రతి సంవత్సరం ముంపునకు గురవుతున్న నిర్వాసిత ప్రజానీకాన్ని ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు పరిహారం అందజేయడంలో బిజెపి, వైసిపి, టిడిపి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సెస్‌ల పేరుతో డబ్బులు వసూలు చేసైనా పనులు పూర్తి చేస్తామనడం సిగ్గుచేటన్నారు. గత టిడిపి, ప్రస్తుత వైసిపిల ఎన్నికల వాగ్దానాలు నీటిమూటలుగా మారాయని విమర్శించారు. పోలవరం నిర్వాసిత కుటుంబానికీ రూ.6 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచి ఇస్తామని, 41.15, 45.72 కాంటూరులో మునిగే గ్రామాలకు అదనంగా 36 గ్రామాలను చేర్చి 200 గ్రామాల వారికి శాస్త్రీయ పద్ధతిలో పరిహారం ఇస్తామని చెప్పి నిర్వాసితులను మోసగించడం తగదన్నారు. బిజెపి, వైసిపిలు ఏజెన్సీలో డబ్బులు ఎర చూపి, ఓటరును మభ్యపెట్టి, ఓట్లు కొనుగోళ్లకు సిద్ధమయ్యాయన్నారు. ఎన్నికల కమిషన్‌ స్పందించి కట్టడి చేయాలని, లేనిపక్షంలో అవినీతితో కూడిన పాలకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారం చేపట్టి ప్రజానీకాన్ని పీడిస్తారని తెలిపారు. ముస్లిం మైనార్టీలకు, పేదరికంలో ఉన్న వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించే దానిలో కూడా మతాన్ని జప్పించి రిజర్వేషన్లు తీసివేస్తానని చెప్పడం బిజెపి మతతత్వానికి నిదర్శనమన్నారు. మాటలతో ప్రజలను నిత్యం మోసం చేస్తున్న బిజెపి, టిడిపి, వైసిపిలకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. పేదలు, ఏజెన్సీలోని గిరిజనుల పక్షాన నిత్యం పోరాడుతూ, గిరిజన చట్టాల రక్షణ కోసం ఉద్యమిస్తున్న రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావును, అరకు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, జిల్లా నాయకులు పల్లపు వెంకట్‌, మల్లం సుబ్బమ్మ, ఎం.రాజయ్య పాల్గొన్నారు.

➡️