సిపిఎం ప్రచారానికి విశేష ఆదరణ

  •  జోరందుకున్న ఎన్నికల ప్రచారం
  •  బిజెపి ఓటమి ఖాయం : వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి-యంత్రాంగం : సిపిఎం అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి ప్రజానీకం నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రజలు గత పాలకుల వైఫల్యాలను నాయకుల వద్ద ప్రస్తావిస్తూ సమస్యలను వివరిస్తున్నారు. ఎన్నికలకు ముందు అనేక హామీలను గుప్పిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమాత్రం పట్టించుకోవటం లేదని వాపోయారు. దీనికి సిపిఎం అభ్యర్థులు స్పందిస్తూ తమను గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. గురువారం గుంటూరు జిల్లాలో నిర్వహించిన ఇండియా వేదిక బలపరిచిన అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయమని తెలిపారు. ఈ ఎన్నికల్లో బిజెపికి 200 సీట్లకు మించి రావని వివరించారు. ఈ సారి ఇండియా వేదికదే విజయమని తెలిపారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు, సిపిఐ గుంటూరు ఎంపి అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన రోడ్‌ షోలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉండవల్లి సెంటర్‌ నుంచి ప్రారంభమైన రోడ్‌ షో కెఎల్‌రావు కాలనీ, సీతానగరం, ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతాల్లో సాగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో వి.శ్రీనివాసరావు, అభ్యర్థి జొన్నా శివశంకరరావు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఉండవల్లి సెంటర్‌లో జరిగిన సభలో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును బిజెపి తీసుకొస్తే.. దానికి రాష్ట్రంలోని టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు మద్దతు తెలపడం దారుణమన్నారు. బిజెపితో కలిసి ఆ మూడు పార్టీలు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల వద్ద తాకట్టు పెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టిడిపి ప్రభుత్వంలో రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అంకెలతో సహా వివరించారు. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్‌ చెప్పడం యువతను మోసం చేయడమేనన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పాపం వైసిపి, టిడిపిలదేనని విమర్శించారు. చంద్రబాబు అమరావతి పేరుతో సింగపూర్‌ గ్రాఫిక్స్‌ చూపించి మోసం చేశారన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో 33,500 ఎకరాలు రైతుల నుంచి తీసుకుని వారికి చుక్కలు చూపించారని తెలిపారు. జగన్‌ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటకు తెరలేపారని విమర్శించారు. విభజన హామీలు అమలు జరపకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో ఎందుకు జత కట్టారో చెప్పాలని ఆ పార్టీలను నిలదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై పోరాడే నాయకులను చట్టసభలకు పంపాలని కోరారు.


పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం సంతలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి మండంగి రమణతో కలిసి సిపిఎం రాష్ట్రదర్శివర్గ సభ్యులు కె.సుబ్బారావమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ ఆదివాసుల హక్కులను కాలరాస్తూ చట్టసభల్లో నల్ల చట్టాలు తీసుకొచ్చిన బిజెపిని, దానికి మద్దతిచ్చిన పార్టీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. గిరిజన బతుకులు బాగుపడాలంటే, హక్కులు, చట్టాలకు రక్షణ ఉండాలంటే అసెంబ్లీలో ప్రశ్నించే వ్యక్తి ఉండాలని అన్నారు.


అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో రంపచోడవరం అభ్యర్థి లోతా రామారావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. గుండువారిగూడెం వద్ద ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. డప్పు వాయిద్యాలు, ప్రజానాట్యమండలి కళాకారుల ప్రదర్శనలతో ఆయన ప్రచారం ఉత్సాహంగా సాగింది. గిరిజనుల సమస్యలపై సిపిఎం నిర్వహించిన పోరాటాలను వివరించారు. తనను గెలిపించాలని కోరారు. జికె.వీధి మండలం రింతాడ పంచాయతీ పెదపాడు, దుచ్చెరపాలెం గ్రామాల్లోనూ, కొయ్యూరు మండలంలోనూ సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స ప్రచారం నిర్వహించారు. గిరిజన చట్టాల అమలుకు తనను గెలిపించాలని కోరారు. విశాఖలోని జివిఎంసి 70వ వార్డు పరిధిలోని దశమకొండ, చిట్టినాయుడు కాలనీ, చట్టివానిపాలెం కాలనీల్లో గాజువాక అభ్యర్థి ఎం.జగ్గునాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


నెల్లూరు 4, 6, 7 డివిజన్‌ పరిధిలోని శెట్టిగుంట రోడ్డు, లక్ష్మీనగర్‌ తదితర ప్రాంతాల్లో నియోజకవర్గ అభ్యర్థి మూలం రమేష్‌ ఎన్నికల ప్రచార నిర్వహించారు. తనను గెలిపిస్తే నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, విజయమహాల్‌ రైల్వే గేటు ప్రాంతంలో బ్రిడ్జి ఏర్పాటు చేస్తానని, డంపింగ్‌ యార్డును దొంతాలి ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతంలో చిల్డ్రన్స్‌ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తానని, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవాలని కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నానని హామీ ఇచ్చారు. ప్రచారంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మన్నూరు భాస్కరయ్య పాల్గొన్నారు.


విజయవాడ 29వ డివిజన్‌, మధురా నగర్‌, సాయిబాబా కాలనీ, నేతాజీ కాలనీ, కాలవకట్ట, కొబ్బరితోట తదితర ప్రాంతాల్లో సింట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌ బాబూరావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం సామాన్యుల భూములను భక్షించేదిగా ఉందన్నారు. ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్న టిడిపిలో చిత్తశుద్ధి కొరవడిందన్నారు. ఈ సదర్భంగా సెంట్రల్‌ నియోజకవర్గ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.


కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలం గూడవల్లి, నిడమానూరు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరప్పాడు గ్రామాల్లో గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు ప్రచారం నిర్వహిస్తూ.. ఈ నెల 8న గన్నవరంలో జరిగే సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. భారత రాజ్యాంగానికి ముప్పుగా మారిన ఎన్‌డిఎ కూటమి అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. దేశ సంపదను అదానీ, అంబానీకి దోచిపెడుతున్న ప్రధాని మోదీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

➡️