లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటూ గెలవదు : మంత్రి కోమటిరెడ్డి

Apr 23,2024 17:37 #Minister Komati Reddy, #press meet

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ నేతలు మొదట తమ పార్టీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తే బాగుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చురక అంటించారు. తనతో 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ చెబుతున్నారని.. కానీ తాను పిలిస్తే 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ రెండు లేదా మూడు సీట్లు గెలుచుకోవచ్చునని జోస్యం చెప్పారు. మెదక్‌లో బీఆర్‌ఎస్‌ మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ ఒక్క సీటూ గెలవదన్నారు. నల్గండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్‌ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. అలాంటప్పుడు ఆయన ఏ మొహం పెట్టుకొని నల్గండలో బస్సు యాత్ర చేపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ మోకాళ్ల యాత్ర చేసినా ఉమ్మడి నల్గండలో డిపాజిట్‌ కూడా రాదన్నారు.

➡️