అభివృద్ధి జాడ లేని బడ్జెట్‌ – పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వ బడ్జెట్‌ అభివృద్ధి వైపు దృష్టిసారించలేదని శాసనమండలి పిడిఎఫ్‌ ఫ్లోర్‌ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదనపై శాసనమండలిలో గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ఎటు వెళ్తుందో బడ్జెట్‌ నిర్ణయించాలని కానీ అందులో వెనుకబడి ఉన్నామన్నారు.. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తావన లేదన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రప్రభుత్వం అమలు చేసిందని బడ్జెట్‌లో పొందుపరచడం దారుణమన్నారు. వెనుకబడిన 7 జిల్లాలకు బుందేల్‌ ఖండ్‌ తరహా ప్యాకేజ్‌ కింద ఇస్తామని చెప్పిన రూ.24,500 కోట్లు ఇవ్వకపోయినా ఆర్ధిక శాఖమంత్రి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. విశాఖపట్నం రైల్వేజోన్‌, రామయపట్నం పోర్టు, కడప ఉక్కు కర్మాగారం వంటి అంశాల్లో అన్యాయం చేసిందని, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించిందన్నారు. ఇంత అన్యాయం చేస్తున్నా కేంద్రం సహాయం చేస్తుందని చెప్పడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత లేదన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.55వేల కోట్లు ఖర్చు చేస్తుందని అంచనా వేసిందని, ఇందులో రూ.33వేల కోట్లు పోలవరం నిర్వాసితుల కోసం కేటాయించారని తెలిపారు. పునరావాసం పూర్తికాకుండా, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా ఈ ప్రాజెక్టు పూర్తి కాదని చెప్పారు. పాలన వికేంద్రీకరణ పేరుతో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని చెప్పారు. జిల్లా, మండల, సర్పంచుల నిధులను పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. డిబిటి అందిస్తున్నామనే పేరుతో ఎస్సి, ఎస్టి సబ్‌ప్లాన్‌ అమలు చేయడం లేదన్నారు.

56 బిసి కార్పొరేషన్‌ల ద్వారా ఖర్చు చేయడానికి నిధులు ఎంత కేటాయించారో చెప్పలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధాన రహదారుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందని, రోడ్లు భవనాల శాఖను బలోపేతం చేయాలని కోరారు. 2023 సెప్టెంబర్‌ 22వ తేదీన 8,366 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో ప్రకటించారని తెలిపారు. కానీ 6,100 టీచర్‌ పోస్టులను భర్తీకి మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేశారని చెప్పారు. ఈ పోస్టుల సంఖ్య పెంచాలని కోరారు. ఉద్యోగులకు 11వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేశామని చెప్పారని, కానీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.

సమానత్వమంటే ఇదేనా.. ఐ. వెంకటేశ్వరరావు ప్రశ్న

                 పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పోరాటాలు చేసేవారిపై రాష్ట్రప్రభుత్వం నిర్భంధం ప్రయోగిస్తోందన్నారు. ఇది ఏ స్వేచ్ఛ, ఎలాంటి సమానత్వమని ప్రశ్నించారు. అంగన్‌వాడీ, ఆశలు, పారిశుద్ధ కార్మికులు ఆందోళన చేస్తుంటే ఎస్మా ప్రయోగించారని తెలిపారు. రాష్ట్ర పిఆర్‌సిల చరిత్రలో అత్యంత అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా 11వ పిఆర్‌సి అమలు జరిగిందన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సమస్యలపై గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఎప్పటికీ అమలవుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. 3 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తే విద్యారంగ పరిస్థితి అర్ధమవుతుందన్నారు టిడిపి ఎమ్మెల్సీ చిరంజీవి రావు మాట్లాడుతూ డిబిటి పేర్లతో బటన్‌ నొక్కుడు కార్యక్రమాలు, అనవసర ప్రచారాలు, నిధులు దుర్వినియోగం, ఉత్పత్తికి దోహదపడని అనవసర వ్యయాలు ఉన్నాయని తెలిపారు.ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని టిడిపి ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, కంచర్ల శ్రీకాంత్‌ విమర్శించారు. వి కళ్యాణి, వంకా రవీంద్ర, అరుణ్‌కుమార్‌, ఏసురత్నం, సునీత, జయమంగళం వెంకట రమణ, ఇక్బాల్‌, కల్పలత తదితరులు ప్రసంగించారు.

➡️