సిపిఎం, సిఐటియు నాయకులపై కేసు కొట్టివేత

Dec 8,2023 08:27 #Case, #cpm leaders

ప్రజాశక్తి -మంగళగిరి (గుంటూరు జిల్లా)భవన నిర్మాణ కార్మికుల పక్షాన పోరాడిన క్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులపై పోలీసులు మోపిన కేసును కోర్టు కొట్టివేసింది. 2016లో టిడిపి అధికారంలో ఉండగా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నిర్మాణం సందర్భంగా నిర్మాణ కార్మికులకు మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం, సిఐటియు నాయకులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవి, సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు డి లకీëనారాయణ, నాయకులు జె నవీన్‌ప్రకాష్‌, డి లెనిన్‌, సిహెచ్‌ శ్రీనివాస్‌లపై తుళ్లూరు పోలీసులు ఐపిసి 143, 147, 188, 341, 506, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుండి మంగళగిరి అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో వాయిదాలు నడుస్తున్నాయి. అయితే ఈ కేసును ప్రాసిక్యూషన్‌ వారు రుజువు చేయకపోవడంతో జడ్జి వి ప్రత్యూష కొట్టివేశారు. సిపిఎం, సిఐటియు నాయకుల తరుపున ప్రముఖ న్యాయవాది కోకా వెంకటప్రసాద్‌ వాదించారు.

➡️