ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మె

central trade unions skm press meet on strike

జయప్రదంచేయండి :  రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు 

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఫిబ్రవరి 16న చేపట్టనున్న గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు అధ్యక్షతన విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో రైతు, కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎపి రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, నాయకులు ప్రసాద్‌, పి జమలయ్య, కౌలు రైతు సంఘం నాయకులు హరిబాబు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరావమ్మ తదితరులు మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఒక పర్యాయం రైతులకు రుణమాఫీ చేయాలని, కేరళ తరహాలో రుణ ఉపశమనం చట్టం చేయాలని, నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని, కనీస వేతన చట్టం రూ.26 వేలు నిర్ణయించి అమలు చేయాలని, ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్‌లో రూ.రెండు లక్షల కోట్లు కేటాయించి 200 రోజులు పని దినాలు పెంచాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సమ్మెలో పెద్దయెత్తున కార్మిక వర్గం, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనకాపల్లి రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ ఎ బాలకృష్ణ అకాల మరణానికి ఈ సమావేశం నివాళులర్పించింది. కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో ఎఐకెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి వెంకటరెడ్డి, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక కన్వీనర్‌ చుండూరు రంగారావు తదితరులు మాట్లాడారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి బాలు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు, జాగృతి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరీదు ప్రసాద్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు పోలారి, రవిచంద్ర, ఎఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు యు వీరబాబు, రిటైర్డు ఐఎఎస్‌ బండ్ల శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ, పివి ఆంజనేయులు, జొన్న శివశంకర్‌, కె అజరు కుమార్‌, కోటా కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్స్‌
1. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ మరియు ఇతర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి.
2. కార్మికులకు నష్టం చేసే 4 లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలి.
3. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ॥26,000/`లు చెల్లించాలి.
4. రైతుల పంటకు కనీస మద్దతు ధర చెల్లించాలి.
5. భూ హక్కుల చట్టం 22ను ఉపసంహరించాలి.
6. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించాలి. స్మార్ట్‌ మీటర్ల బిగింపును ఆపాలి.
7. ఆటవీ హక్కుల చట్టం సవరణలు ఉపసంహరించాలి. ఆది వాసీల హక్కులను కాపాడాలి.
8. ఆహార భద్రత చట్టాన్ని పట్టిష్టపర్చాలి.
9. ముఠా, ఆటో, బిల్డింగ్‌, తోపుడుబండ్లు మొ॥గు అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి.
ఉద్యోగ భద్రత కల్పించాలి.
10. ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం, విఓఎ తదితర స్కీం వర్కర్లలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
11. 2014 విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలి.

పై డిమాండ్‌ల సాధన కోసం విస్తృతంగా ఇంటింటికి, ఫ్యాక్టరీల వద్ద కరపత్రాలు పంపిణీ చేయాలని, గ్రూప్‌ మీటింగ్‌లు, గేట్‌ మీటింగ్‌లు నిర్వహించాలని, పారిశ్రామిక సమ్మెను, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ బైక్‌యాత్రలు నిర్వహించాలని ఫిబ్రవరి 16తేదిన సరస్వతి పార్కు నుండి జివియంసి గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, ఎఐటియుసి అధ్యక్షులు ఎం. మన్మధరావు, ఐఎన్‌టియుసి అధ్యక్షులు కె.ఈశ్వరరావు, ఐఎఫ్‌టియు కె.మల్లన్న, సిఎఫ్‌టియుఐ జాతీయ నాయకులు ఎన్‌ కనకరావు, ఎపిఎఫ్‌టియు నాయకులు కె.దేవా, ఎఐసిసిటియు నాయకులు ఎం. రామచంద్రరాజు, టిఎన్‌టియుసి నాయకులు పి.పైడిరాజు, సంయుక్త కిసాన్‌మోర్చా నాయకులు జి.నాయినాబాబు, విశాఖజిల్లా మోటారు ట్రాన్స్‌పోర్టు జిల్లా కార్యదర్శి జి.అప్పలరాజు, విశాఖపట్నం పోర్టు డాక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు ఈశ్వరరావు, ఇంటి పనివారల సంఘం నాయకులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️