ఎమ్మెల్యే పిన్నెల్లిపై సీఈసీ సీరియస్.. అరెస్ట్ చేయాలని ఆదేశాలు

ప్రజాశక్తి-అమరావతి : మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్‌ నంబర్‌ 202తో పాటు 7 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రాష్ట్ర ఎన్నికల అధికారికి నోటీసులు పంపింది. ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని.. అలాగే ఈ ఘటనపై ఎమ్మెల్యే పిన్నెల్లి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే ఈ ఘటనపై సాయంత్రం ఐదు గంటల లోపు నివేదిక ఇవ్వాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ, ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించాలని సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనాను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయకుండా కఠినంగా వ్యవహరించాలని ఈసీ ఆదేశించింది.

➡️