రాష్ట్రాన్ని బిజెపికి తాకట్టు పెట్టిన పార్టీలను ఓడించాలి

Apr 30,2024 18:05 #2024 election, #Ch Baburao, #cpm
  •  సిహెచ్‌ బాబురావు, వల్లూరు భార్గవ ఉమ్మడి ప్రచారం
  •  సెంట్రల్‌ లో కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ భారీ ర్యాలీ

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రాన్ని బిజెపికి తాకట్టు పెట్టిన పార్టీలను ఓడించాలని విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఇండియా వేదిక పార్లమెంటు అభ్యర్థి వల్లూరు భార్గవ, సెంట్రల్‌ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఉమ్మడి ప్రచారం, రోడ్‌ షో నిర్వహించారు.కండ్రిక సెంటర్‌ నుండి బయలుదేరిన ఈ యాత్ర రాజీవ్‌ నగర్‌, ప్రకాష్‌ నగర్‌, శాంతినగర్‌, వాంబే కాలనీ, సింగనగర్‌, ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, గవర్నమెంట్‌ ప్రెస్‌, ముత్యాలంపాడు, సత్యనారాయణపురం మీదుగా బిఆర్‌ టి ఎస్‌ రోడ్డు వరకు జరిగింది. ఈ సందర్భంగా పలు సభల్లో నేతలు మాట్లాడారు. స్థానిక ప్రజలను కలుసుకొని ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మోడీ, బిజెపి ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. ఎన్నికల్లో పరాజయం తప్పదని మోడీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం పరిరక్షించాలంటే ఇండియా వేదిక పార్టీలు గెలవాలని.. ఇండియా వేదిక గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్‌ కి ప్రత్యేక హౌదా లభిస్తుందని. రాజధాని అమరావతి నిలబడుతుందని.. విశాఖ ఉక్కు పరిరక్షించబడుతుందని.. అన్ని వర్గాల ప్రజలకు గ్యారెంటీ లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి బిజెపికి లొంగిపోయాయన్నారు. శాసనసభలో ఇండియా వేదిక పార్టీలు బలంగా ఉండాలని.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని.. కేంద్రం నిరంకుశత్వాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

సిపిఎం, సిపిఐ నేతల మాట్లాడుతూ.. మోడీ, బిజెపి.. అంబానీ, ఆదానీలకు దాసోహం అంటూ చిన్న , మధ్యతరగతి వ్యాపారులను, పరిశ్రమలను దెబ్బతీస్తున్నదన్నారు. కార్మిక హక్కులను హరిస్తోందని.. రాష్ట్రాలను దెబ్బతీస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిందని.. వైసీపీతో జతకట్టి అమరావతిని నాశనం చేసిందన్నారు. ధరలు పెంచిన మోడీ మూడోసారి వస్తే మరింత భారాలు పడతాయన్నారు. విజయవాడలో ఏమి చేశారని వైసీపీ, తెలుగుదేశం, బిజెపి నేతలు మళ్లీ ఓట్లు అడుగుతారన్నారు.
– ఉపాధి చూపించే ఒక్క పరిశ్రమ తెచ్చారా? సంస్థ ఏర్పాటు చేశారా?
– నగరంలో ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు, బైపాస్‌ రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించారా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ పోరాడింది కమ్యూనిస్టులేనని.. ప్రజా సమస్యలపై పోరాడే బాబురావును.. భార్గవ్‌ను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార యాత్రలో కాంగ్రెస్‌ నేతలు నరహరిశెట్టి నరసింహారావు, మీసాల రాజేశ్వరరావు, బైపూడి నాగేశ్వరరావు, బేగ్‌, వి గురునాథం, సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్‌, సిపిఐ నేత కేవీ భాస్కర్‌రావు, సిపిఎం నేతలు డివి కృష్ణ, శ్రీదేవి, బి.రమణరావు, కే.దుర్గారావు, ఎన్‌ శ్రీనివాస్‌, టీ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️