‘రా.. కదలిరా’ పేరుతో జనంలోకి చంద్రబాబు

Jan 2,2024 22:16 #Achchennaidu, #press meet

– కనిగిరిలో 5న తొలి బహిరంగ సభ

– టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ‘రా.. కదలిరా’ పేరుతో ఈ నెల 5 నుంచి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌, రూట్‌ మ్యాప్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 5 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 5న తొలి బహిరంగసభ ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టిడిపి, జనసేన సంయుక్తంగా నిర్వహించే సభలకు చంద్రబాబుతోపాటు కొన్ని సభలకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా హాజరవుతారని తెలిపారు. ఈ నెల 3న మంగళగిరిలోని పార్టీ కార్యాలయం సమీపంలోని సి కన్వెన్షన్‌లో పంచాయతీరాజ్‌ విభాగం సదస్సు, 4న పార్టీ కార్యాలయంలో చంద్రబాబు చేతులమీదుగా ‘జయహో బిసి’ సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టిడిపిలో చేరికలకు సంబంధించి రెండు కమిటీలు వేశామన్నారు. టిఎన్‌టియుసి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ఉంటుందన్నారు. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన పోస్టరును ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు పాల్గొన్నారు.

➡️