పేదల ఆకలి తీర్చే ‘అన్నా క్యాంటీన్‌’

– కనిగిరిలో రెండోరోజూ చంద్రబాబు పర్యటన

ప్రజాశక్తి- కనిగిరి (ప్రకాశం)పేదల ఆకలి తేర్చేది అన్నా క్యాంటీనులు అని మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. క్యాంటీన్‌ను ప్రారంభించి 365 రోజులు అవుతున్న సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రూపొందించిన పాటల సిడిని ఆవిష్కరించారు. వైసిపికి చెందిన పలువురు నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు, నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కనిగిరిలో ‘రా కదలిరా’ ఎన్నికల శంఖారావం ప్రారంభం, బహిరంగ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం అమరావతి గ్రౌండ్‌ నుంచి పెనుగొండ సాధన ప్రాంగణం వద్దకు కారులో చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️