మాజీ ఐఎఎస్‌లను ఉసిగొల్పుతున్న చంద్రబాబు

  •  పివి రమేష్‌ భూ వివాదానికి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు సంబంధం లేదు : పేర్నినాని

ప్రజాశక్తి- కృష్ణ ప్రతినిధి : ప్రభుత్వంపై విషం చిమ్మెలా కొంతమంది మాజీ ఐఎఎస్‌ అధికారులను టిడిపి అధినేత చంద్రబాబు ఉసిగొల్పుతున్నారని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆరోపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మాజీ ఐఎఎస్‌ పివి రమేష్‌కు గ్రామంలోని రైతులతో ఉన్న భూ వివాదానికి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో ఎటువంటి సంబంధమూ లేదన్నారు. చంద్రబాబు కోసం ఆయన దిగజారి ట్వీట్‌ చేశారని విమర్శించారు. వాస్తవాలకు మసిపూసి ప్రభుత్వంపై విషం చిమ్మడం సమంజసమా అని ప్రశ్నించారు. పివి రమేష్‌ తండ్రి సుబ్బారావు మాస్టర్‌ కొందరు రైతులతో కలిసి 70 ఎకరాల పొలాన్ని 20 ఏళ్ల క్రితమే చేపల చెరువుగా తవ్వి అందరితో కలిసి లీజుకు ఇచ్చారన్నారు. సరిహద్దులు లేని పివి రమేష్‌ పొలం ఇప్పటికే వివాదంలో ఉందని, వినగడపలో జనవరి నెలలో ఈ భూ వివాదంపై విచారణ జరిగిందని, అధికారులు చెప్పిన విధంగా భూముల అసలు పత్రాలు ఇప్పటి వరకు రమేష్‌ తీసుకురాలేదన్నారు. అక్కడ రైతులకు పివి రమేష్‌కు గొడవలు ఉంటే ప్రభుత్వంపై బురద చల్లడం తగదన్నారు.

➡️