ఇబ్బందులుంటే మార్పు, చేర్పులుంటాయ్

Apr 9,2024 17:54 #Chandrababu Naidu, #found, #TDP
  •  టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టీకరణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినా..తమ కూటమి అభ్యర్థల విషయంలో ఏ నియోజకర్గంలోనైనా ఇబ్బందులు వస్తే మార్పు, చేర్పులుంటాయని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రజల నుంచి విరాళాలు కోరుతూ ప్రత్యేకంగా రూపొందించిన https://tdpforandhra.com/ వెబ్‌సైట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. తన వంతుగా రూ.99,999 విరాళాన్ని పంపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా తమకు వీలైనంత సాయం అందించాలని కోరారు. ఈ సందర్భంగా బిజెపి, టిడిపి, జనసేన కూటమి అభ్యర్థుల విషయంలో అసంతృప్త సెగలు, నిరసనలపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ ‘కూటమి అభ్యర్థుల విషయంలో ఎక్కడైనా ఏవైనా ఇబ్బందులుంటే అభ్యర్థుల మార్పు, చేర్పులు ఉంటారు’ అని తెలిపారు. సిఐడి అధికారులు హెరిటేజ్‌కు సంబంధించిన పత్రాలను తగలబెట్టారన్న కథనాలపై స్పందిస్తూ వైసిపి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతుందని అన్నారు. కాగా హెరిటేజ్‌ ఫైళ్ల ఘటనపై రాష్ట్ర డిజిపి సమగ్ర విచారణ చేపట్టాలని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ ఫైళ్లను సిఐడి డిజి కొల్లి రఘురామిరెడ్డి దహనం చేయించారని ఆరోపించారు.
టిడిపి గూటికి సీతంరాజు
బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌తో పాటు విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు టిడిపిలో చేరారు. టిడిపి కార్యాలయంలో చంద్రబాబు వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వివిధ సంఘాల నాయకుల భేటీ
వివిధ సంఘాలకు చెందిన నాయకులు టిడిపి కార్యాలయంలో మంగళవారం చంద్రబాబును కలిశారు. ముస్లిం వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రఫి, ప్రధాన కార్యదర్శి మీరాబాబు, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూఖ్‌ షుబ్లీ, కరీముల్లా, మాల మహానాడు నేతలు గోళ్ల అరుణ్‌కుమార్‌, గుజ్జర్లపూడి చారువక, అన్నవరపు కిషోర్‌ తదితరులు చంద్రబాబును కలిసి టిడిపికి మద్దతుగా ఉంటామని తెలిపారు.

 

➡️