అటవీ కార్మికులకు న్యాయం చేయాలి

Jan 29,2024 20:10 #ttd, #ttd employees
citu support to fms workers protest
  • లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
  • దీక్షకు సిహెచ్‌ నర్సింగరావు సంఘీభావం
  • జిల్లావ్యాప్తంగా సిఐటియు నిరసనలు

ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ : జూనియర్లను పర్మినెంట్‌ చేసి సీనియర్లకు అన్యాయం చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు పేర్కొన్నారు. ఈ తప్పును టిటిడి యాజమాన్యం సరిదిద్దుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. 1160 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న టిటిడి అటవీ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. తిరుపతిలో టిటిడి అటవీ కార్మికులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌ రెడ్డి పాలన కార్మిక వ్యతిరేకంగా తయారైందని, ధార్మిక సంస్థ టిటిడిలోనూ ఈ ధోరణులు పెరిగిపోయాయని విమర్శించారు. తాజాగా అంగన్‌వాడీల పోరాటాన్ని నిర్వహించిన సిఐటియు దీనికి నాయకత్వం వహిస్తున్న విషయాన్ని టిటిడి యాజమాన్యం గుర్తుంచుకోవాలని అన్నారు. టిటిడి బోర్డులో కార్మిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నం జరుగుతోందన్న విశ్వాసం కల్పించాల్సిన అవసరం చైౖర్మన్‌ కరుణాకర్‌ రెడ్డిపై ఉందని, ఇటీవల కొన్ని సమస్యలు పరిష్కరించారని, దీర్ఘకాలంగా పోరాడుతున్న అటవీ కార్మికుల విషయం ఎందుకు పట్టించుకోవడంలేదని, ఈ కుట్రకు పాత్రధారులు, సూత్రధారులు ఎవరనే విషయం వెల్లడి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టిఎన్‌టియుసి రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కల రఘురామ కృష్ణంరాజు, టిటిడి బోర్డు మాజీ సభ్యులు ఒవి రమణ, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఆర్‌పిఐ దక్షిణ భారత అధ్యక్షులు పూతలపట్టు అంజయ్య, బిఆర్‌ఎస్‌ నేత ఆర్కాట్‌ కృష్ణప్రసాద్‌ మద్దతు ప్రకటించారు. ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌(ఐలు) ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. న్యాయవాదుల సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరాజులు, జిల్లా నేతలు పాల్గొన్నారు.

జిల్లావ్యాప్తంగా నిరసనలు

శ్రీకాళహస్తిలో ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. 2005, 2011లో టిటిడి యాజమాన్యం సూచన మేరకు సొసైటీగా ఏర్పడిన కార్మికులను కాదని, 2013లో చేరిన జూనియర్లను పర్మినెంట్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. కెవిబిపురంలో సిఐటియు కార్యాలయం వద్ద, నాయుడుపేట తహశీల్దార్‌ కార్యాలయం వద్ద, గూడూరు సబ్‌కలెక్టరేట్‌ ఎదుట, పుత్తూరులో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహించారు.

➡️