ముద్దనూరులో హైటెన్షన్‌

Jan 31,2024 21:52 #Clashes, #Dispute, #Kadapa, #TDP, #YCP
clashes between tdp ycp members

– వైసిపి, టిడిపి గ్రూపుల మధ్య ఘర్షణ

– రాళ్లు విసురుకున్న ఇరు గ్రూపుల నాయకులు

– కారు అద్దాలు ధ్వంసం

– రోడ్డుపై బైఠాయించి భూపేష్‌ రెడ్డి నిరసన

ప్రజాశక్తి – ముద్దనూరు (వైఎస్‌ఆర్‌ జిల్లా) :వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ముద్దనూరులో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. వైసిపి, టిడిపి గ్రూపుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు గ్రూపులకు చెందిన వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కుర్చీలు గాలిలో విసిరి వేశారు. ఈ సంఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వివరాలు.. నియోజకవర్గ వైసిపి నేత మునిరాజా రెడ్డి సోదరుడు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి మేనమామ వరుస అయిన శశిధర్‌రెడ్డి దాదాపు మూడేళ్లగా ఎమ్మెల్యేతో విభేదించి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల కమలాపురంలో నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ నేపథ్యంలో శశిధర్‌రెడ్డి తన అనుచరులను జమ్మలమడుగు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేర్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయమై చర్చించేందుకు టిడిపి నాయకులు, కార్యకర్తలు శశిధర్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మునిరాజా రెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడకు చేరుకుని ఆగ్రహంతో టిడిపి నాయకులపై దాడి చేశారు. ఆగ్రహించిన టిడిపి కార్యకర్తలు ఎమ్మెల్యేపై తిరగబడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శశిధర్‌డ్డి ఇంట్లో ఉన్న టిడిపి నాయకులను బలవంతంగా బయటకు లాగేశారు. విషయం తెలుసుకున్న టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఇరు గ్రూపులకు చెందిన వారు పరస్పరం కుర్చీలు, రాళ్లు విసురుకున్నారు. రాళ్ళ దాడిలో ఒక కారు, శశిధర్‌ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఇరు గ్రూపులకు చెందిన వారిని చెదరగొట్టారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భూపేష్‌రెడ్డి తన కార్యకర్తలతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకొని దాడులకు పాల్పడుతున్నారని భూపేష్‌రెడ్డి ఆరోపించారు. దేవగుడి నాయకులు జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ నాయకులను, కార్యకర్తలను ప్రలోభపెట్టి కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి ఆరోపించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ముద్దనూరులో భారీగా పోలీసులు మోహరించారు.

➡️