ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు -ముగ్గురు మావోయిస్టుల కాల్చివేత

Jan 21,2024 08:17 #died, #Three Maoists

ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా):ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం… బాసగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధి మద్దెడు, బలంనేండ్ర అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ నాయకులు వినోద్‌ కర్మ, ఆవుపల్లి కమాండర్‌ రాజు, పూణెం, విశ్వనాథ్‌ సమక్షంలో 20 మంది మావోయిస్టులు సమావేశమైనట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో, పోలీస్‌ డిఆర్‌జి 2010 బెటాలియన్‌ కోబ్రా దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. వారికి మావోయిస్టులు తారసపడడంతో ఇరు పక్షాల నడుమా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మృతుల పేర్లు తెలియరాలేదు. ఘటనా స్థలంలో పోలీసులకు పేలుడు పదార్థాలు, కొన్ని రకాల మందులు, దుస్తులు, వంట పాత్రలు లభ్యమయ్యాయి.

➡️