కుట్రల కూటమి 

Apr 20,2024 23:12
  • 2014లో ఆ పార్టీలు ఏ హామీనీ నెరవేర్చలేదు
  • ‘మేమంతా సిద్ధం’ సభలో సిఎం జగన్‌

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, కశింకోట విలేకరి : ‘ప్రజలకు మంచి చేసి తాను ఒక్కడినే ఒక వైపు ఉంటే… బిజెపి, టిడిపి, దత్తపుత్రుడు (పవన్‌ కల్యాణ్‌) కలిసి బాణాలు, ఆయుధాలు పట్టుకొని ఇంకోవైపు నిల్చుని ఉన్నారు. ఉక్రోషంతో చంద్రబాబు నాపై రాళ్లు వేయమంటున్నారు. నన్ను దగ్ధం చేయమంటున్నారు. వారిదంతా కుట్రల కూటమి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒక్కడిని ఎదుర్కొనేందుకు ఇంత మంది కలిసి వస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శనివారం అనకాపల్లి జిల్లాలో కొనసాగింది. యాత్రలో భాగంగా కశింకోట మండలం నర్సింగబిల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దోచుకోవడానికి, పంచుకోవడానికి, జగన్‌ను కొట్టడానికి, హాని చేయడానికి కూటమికి అధికారం కావాలంట అని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన ఇదే కూటమి అనేక హామీలిచ్చి నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పుడు అదే కూటమి మళ్లీ అబద్ధాలతో మోసపూరిత వాగ్దానాలు, మేనిఫెస్టోతో వస్తోందని తెలిపారు. లంచాలు, వివక్షలేని పాలన కొనసాగాలంటే వైసిపి ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికలు కావడంతో ఈసారీ తమ ప్రభుత్వాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం 58 నెలల్లో చేసిన మంచి పని 14 ఏళ్ల పాటు సిఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. చేసిన మంచిలేక మోసాలు, కుట్రలు, పొత్తులతో కూటమి పార్టీలు ముందుకు వస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు భ్రమలు కల్పిస్తూ తిరుగుతున్న కూటమిని ఓడించేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. జగన్‌ను ఒక బచ్చా అంటున్నారని, పోయేకాలం, ఓడిపోయే కాలం వచ్చినప్పుడు హీరోలు కూడా బచ్చాలుగా కనిపిస్తారని బాబును ఉద్దేశించి అన్నారు. కుట్రల కూటమైనా, పేదలు, అక్క, చెల్లెమ్మల తోడు తనకు ఉంటే చాలన్నారు. సభలో వైసిపి అనకాపల్లి ఎంపి అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, పెందుర్తి, పాయకరావుపేట, యలమంచిలి, మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థులు మలసాల భరత్‌ కుమార్‌, ఉమా శంకర్‌ గణేష్‌, కరణం ధర్మశ్రీ, అదీప్‌రాజ్‌, కంబాల జోగులు, యువి.రమణమూర్తి రాజు, ఈర్లె అనురాధలను సిఎం పరిచయం చేసి గెలిపించాలని కోరారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని గొడిచర్ల నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర ఉద్దండపురం, కాగిత, సీతపాలెం, నక్కపల్లి, పులపర్తి, రేగుపాలెం, యలమంచిలి (బైపాస్‌) మీదుగా నర్సింగబిల్లికి చేరుకుంది. అక్కడ సభ అనంతరం తాళ్లపాలెం జంక్షన్‌, జమదులపాలెం, బుచ్చెయ్య పేట, కశింకోట, కొత్తూరు, అనకాపల్లి, శంకరం, రేబాక, మర్రిపాలెం టోల్‌, దేవీపురం, గాలి భీమవరంల్లో సాగింది. సిఎం జగన్‌ చిన్నయ్యపాలెంలోని టెర్రకాన్‌ రాయల్‌లో బస చేశారు.

➡️