ప్రొద్దుటూరులో మొదటి సభ : సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 27న ప్రొద్దుటూరులో మొదటి సభ నిర్వహించనున్నట్లు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌తో కలిసి ఆయన రూట్‌ మ్యాప్‌ను మీడియాకు వివరించారు. సిద్ధం సభలు జరిగిన పార్లమెంటు నియోజకవర్గాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో ఈ బస్సు యాత్ర ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ప్రజలతో సిఎం వైఎస్‌ జగన్‌ మమేకమవుతారన్నారు. అలాగే 28న ఆళ్లగడ్డలో రెండో సభ, 29న ఎమ్మిగనూరులో మూడో సభ వుంటుందని తెలిపారు. బహిరంగ సభ జరిగే ప్రాంతాల్లో ప్రజలతో ముఖాముఖి వుంటుందన్నారు. ఈ యాత్ర ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ సాగుతుందని తెలిపారు. ఏప్రిల్‌ 18 వరకూ ఈ బస్సు యాత్ర వుంటుందని, ఆ తర్వాత నామినేషన్‌లు మొదలైనప్పటి నుంచీ ఎన్నికల సభలు వుంటాయని అన్నారు.

➡️