ప్రసంగాల్లేకుండా సిఎం పర్యటన

  •  ‘అనంత’లో ముగిసిన ‘మేమంతా సిద్ధం’
  •  మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషాతో పాటు, పలువురు వైసిపిలో చేరిక

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ఎటువంటి ప్రసంగాలు లేకుండా ఉమ్మడి అనంతపురం లో సిఎం పర్యటన ముగిసింది. శని, సోమవారం రెండు రోజులపాటు మేమంతా సిద్ధం యాత్ర జరిగింది. ఆదివారం విరామం ఉండటంతో సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం సంజీవపురం వద్ద బసచేశారు. ఆ ప్రాంతం నుంచి సోమవారం ఉదయం యాత్రను ప్రారంభించారు. బత్తలపల్లి, ముదిగుబ్బ, నాగారెడ్డిపల్లి మీదుగా రాత్రికి కదిరి పట్టణానికి చేరుకున్నారు. అన్ని చోట్లా భారీ జనసందోహం రావడంతో యాత్ర ఆలస్యంగా సాగింది. కదిరిలో పివిఆర్‌ ఫంక్షన్‌ హాలులో సాయంత్రం ఐదు గంటలకు ఇప్తార్‌ విందుకు రావాల్సి ఉండగా రాత్రి ఎనిమిది గంటలకు చేరుకు న్నారు. ముస్లిం మతపెద్దల ప్రత్యేక ప్రార్థనాల అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. మోటుకపల్లి, జోగన్నపేట, ఎస్‌.ములకపల్లి మీదుగా రాత్రికి అన్నమయ్య జిల్లాలోని చీకటి మానుపల్లి గ్రామానికి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు.
రెండు రోజుల ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో ఎక్కడా ఎటువంటి ప్రసంగాలు లేకుండానే సాగింది. సిఎం పర్యటన సందర్భంగా వైసిపిలోకి పలువురు నాయకులు చేరారు. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ బాంద్‌బాషా టిడిపి నుంచి వైసిపిలోకి చేరారు. లేపాక్షి మాజీ ఎంపిపి హనోక్‌, అమడగూరు మాజీ జెడ్‌పిటిసి సభ్యులు పొట్ట పురుషోత్తంరెడ్డి, పొట్ట మల్లికార్జునరెడ్డి తదితరులు వైసిపిలో చేరిన వారిలో ఉన్నారు.

➡️