చల్లని కబురు

May 15,2024 09:53 #heavy rains, #weather report
  • 19 కల్లా అండమాన్‌కు నైరుతి రుతుపవనాలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వేసవి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే అండమాన్‌ను తాకనున్నాయి. ఈ నెల 19వ తేదీకల్లా దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. మరోవైపు దక్షిణ కర్ణాటక నుండి వాయువ్య మధ్యప్రదేశ్‌ వరకూ విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం కొన్నిచోట్ల వడగాడ్పులు ఉన్నా, ఎక్కువచోట్ల వర్షాలు పడ్డాయి. వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని గతంలో వాతావరణశాఖ, ప్రకృతి విపత్తులశాఖ హెచ్చరికలు జారీ చేశాయి. అయితే కొద్దిరోజులుగా ఉదయం వేడిగా ఉన్నా మధ్యాహ్నం నుండి చల్లబడటం, అప్పటికప్పుడు వర్షం పడుతుండటంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. అయినా వడగాడ్పులు, తీవ్ర ఉష్ణోగ్రతల నుండి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకృతి విపత్తులశాఖ సూచించింది.

➡️