కర్లపాలెం నిర్వాసితులకు పరిహారం పెంచాలి

– సిఐటియు రాష్ట్ర పధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు
ప్రజాశక్తి -గుడ్లూరు (నెల్లూరు జిల్లా) :రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు పరిహారం పెంచాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం కర్లపాలెంలో ఆ గ్రామ సర్పంచ్‌ చాపల రమణయ్య అధ్యక్షతన ఆదివారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ.. పోర్టు కోసం మత్స్యకారులు సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారని తెలిపారు. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో పోర్టులన్నిటినీ ప్రయివేటు వ్యక్తులకు, అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతోందని తెలిపారు. పోర్టులు వారి చేతుల్లోకి వెళ్లిన తరువాత నిర్వాసితులను పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కావాలంటే పోరాటమే ఏకైక మార్గమని అన్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ వ్యయం పెరిగిన నేపథ్యంలో నిర్వాసిత గ్రామమైన కర్లపాలెంలో ఇళ్లకు మరోసారి రీసర్వే చేసి పరిహారం పెంచి చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

➡️