వెంటనే నష్టపరిహారం చెల్లించాలి

Feb 27,2024 08:18 #AP Rythu Sangam, #Dharna, #Tenali
  • తెనాలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద బాధిత రైతుల ధర్నా
  • అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం తాత్సారం : కృష్ణయ్య

ప్రజాశక్తి-తెనాలి రూరల్‌ (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా తెనాలి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద దుగ్గిరాల శుభం మహేశ్వరీ కోల్డ్‌ స్టోరేజ్‌ అగ్ని ప్రమాద బాధిత రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యాలయం వద్ద సబ్‌కలెక్టర్‌ కారును ఆపి తమ కష్టాలను రైతులు వివరించారు. మీ సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నానుద్దేశించి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. కృష్ణయ్య మాట్లాడుతూ.. కోల్డ్‌ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం సంభవించి 37 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం, యాజమాన్యం నుంచి ఎటువంటి ప్రకటనా రాకపోవడం బాధాకరమన్నారు. రూ 100 కోట్లు నష్టం వాటిల్లినా… కమిటీ నివేదిక పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయటం శోచనీయమన్నారు. పసుపు రైతులకు సంబంధించి కోల్డ్‌ స్టోరేజీలో నికర నిల్వలతో పాటు, భద్రపరచిన రైతుల వివరాలను యాజమాన్యం వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ జొన్న శివశంకర్‌ మాట్లాడుతూ. ప్రభుత్వ నిర్లక్షాన్ని ఖండిస్తూ మార్చి ఒకటి నుంచి నిర్వహించే రిలే నిరాహారదీక్షలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. జిడిసిసి బ్యాంక్‌ మాజీ చైర్మన్‌, రేపల్లె మాజీ శాసన సభ్యులు ముమ్మనేని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ.. కోల్డ్‌ స్టోరేజీలో అగ్ని ప్రమాదం సంభవించిన అనంతరం మంటలను అదుపుచేసే యంత్రాలు లేకపోవడం యాజమాన్య బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రమాద బీమాతో పాటు విపత్తుల నిధి నుంచి క్వింటాలుకు రూ.12 వేలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడారు. ధర్నాలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి, తెలుగు రైతు సంఘం జిల్లా అధ్య క్షులు కళ్లెం రాజశేఖర్‌ రెడ్డి, తెలుగు రైతు నాయకులు ఈదర పూర్ణచంద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️