పోస్టల్‌ బ్యాలెట్‌ గందరగోళం

May 4,2024 23:45 #narasannapeta, #Postal ballot
  • జిల్లా మార్పులతో ఇబ్బందులు

ప్రజాశక్తి- యంత్రాంగం : పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులు పాల్గొనే ఉద్యోగులకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రారంభమైంది. జిల్లా మార్పుతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని గోకవరం మండలం తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైంది. జగ్గంపేట, గండేపల్లి మండలాలు కాకినాడ జిల్లాలో ఉన్నాయి. గోకవరం మండలంలో పోస్టల్‌ బ్యాలెట్‌కు 261 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 14 మంది మొదటి రోజు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి వచ్చారు. వారికి అక్కడ ఓట్లు లేవని సిబ్బంది చెప్పారు. జిల్లా మార్పు నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో ఓటు వేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఉద్యోగులు తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంతో ఓటు వేయకుండానే వెనుదిరిగారు. అనంతపురం జిల్లాలోనూ ఇటువంటి పరిస్థితే తలెత్తడంతో కలెక్టర్‌ జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించారు. రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని ఉద్యోగులకు రాప్తాడులోనే ఓటు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో రాత్రి ఏడు గంటల తరువాత పోస్టల్‌ బ్యాలెట్‌ నమోదు ప్రారంభమైంది. ఈ కేంద్రానికి చెందిన అనంతపురం జిల్లా ఉద్యోగులు కొందరు శిక్షణ నిమిత్తం వచ్చారు. వీరంతా అనంతపురం జిల్లా పరిధిలోనే ఓటు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు తెలపడంతో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత ఉన్నతాధికారుల సూచన మేరకు కదిరిలోనే ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఆలస్యమైంది. ఎక్కడ పనిచేసే వారు అక్కడే ఓటు వేయాలనే సమాచారాన్ని అధికారులు ముందుగా ఇవ్వకపోవడంతో ఏలూరు జిల్లాలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఉదయం పది గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్యోగులు చొరబడడంతో కొంత గందరగోళం చోటుచేసుకుంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వైసిపి, టిడిపి ఏజెంట్ల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది. అల్లూరి జిల్లాలో తొలిరోజు మొత్తం 683 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు. ప్రకాశం జిల్లాలోనూ పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభమైంది. పలు జిల్లాల్లో ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.

తేదీ మార్పుపై నిరసన
కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడి పాండురంగ హైస్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్ద ఓటు వేసేందుకు వచ్చిన అంతర్‌ జిల్లా ప్రభుత్వోద్యోగులు ఆందోళనకు దిగారు. 4వ తేదీనే పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలని తమకు ఆర్డర్‌ కాపీ ఇచ్చి ఇప్పుడు తేదీ మారిస్తే ఎలా అని అధికారులను ప్రశ్నించారు.

➡️