రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

Apr 14,2024 21:34 #DYFI, #sadassu

– ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ కార్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలి
– సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ :రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థి, యువజన సంఘాలపై ఉందని, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ కార్యాలయాలు కార్యకర్తలను తయారు చేసే విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ అన్నారు. కర్నూలులోని కార్మిక కర్షక భవన ప్రాంగణంలో నిర్మించిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయాన్ని సెయింట్‌ జోసఫ్‌ విద్యా సంస్థల అధినేత శౌరీల్‌ రెడ్డి, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యాలయాన్ని ఎంఎ.గపూర్‌ ఆదివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకు ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎస్‌.అబ్దుల్లా, వై.నగేష్‌, అధ్యక్షత వహించారు. ముందుగా డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ చిత్రపటానికి ముఖ్య అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గఫూర్‌ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో విద్యార్థి, యువజన సంఘాల కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో, హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలపై పోరాడినప్పుడే విద్యార్థి సంఘాల నాయకులకు గుర్తింపు లభిస్తుందని తెలిపారు. చదువులోనూ ముందుండాలని, అప్పుడే గౌరవం పెరుగుతుందని అన్నారు. అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని, నిత్యం అధ్యయనం చేస్తూ పోరాడాలని సూచించారు. రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాల అభివఅద్ధికి, జిల్లా సమగ్రాభివృద్ధికి విద్యార్థి, యువజన సంఘాలు కఅషి చేయాలని కోరారు. మూడోసారి మోడీ అధికారం చేపడితే రాజ్యాంగంలోని పీఠికలో కొన్ని అంశాలను మార్చాలని చూస్తున్నారని, మత రాజ్యాంగంగా మార్చాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ విధానాలపై పోరాడాలని కోరారు. రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్‌ జి.పుల్లయ్య మాట్లాడుతూ.. చదువు, పోరాటానికి సమాన అవకాశాలు ఇవ్వాలన్నారు. ఉన్నత పదవుల్లో అత్యధికంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ సంఘాల్లో పని చేసిన వాళ్లే ఉన్నారని, వారి ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. సెయింట్‌ జోషప్‌ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్‌ శౌరిల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే పిల్లలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.

➡️