మండంగి రమణ, పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలని సిపిఎం బైక్‌ ర్యాలీ

May 10,2024 16:58 #cpm

జియ్యమ్మవలస : ఇండియా బ్లాక్‌ బలపర్చిన సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ బైక్‌ ర్యాలీని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాథం ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు కె.లోకనాథం, ఎం.సూర్యనారాయణ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు కోవాలంటే బీజేపీని, ఆ పార్టీకి మద్దతిస్తున్న తెలుగుదేశం, వైసీపీలను ఓడించాలని పిలుపునిచ్చారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషిచేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి మండంగి రమణ, అరకు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న పాచిపెంట అప్పల నరసను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి నిత్యావసర సరుకులు ధరలు పెంచుతూ ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీస్తూ గ్రామీణ ప్రజలకు తీవ్ర నష్టం చేస్తోందన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు తీవ్ర నష్టం చేసే ల్యాండ్‌ టైట్లింగ్‌, విద్యుత్‌, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, దేశ ప్రజలకు తీవ్ర ప్రమాదాన్ని బిజెపి తెస్తోందన్నారు. బిజెపిని నిలువరించాల్సిన తెలుగుదేశం, వైసీపీ, జనసేనలు అదే పార్టీని బలపరచడం దుర్మార్గమని ఖండించారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడడానికి ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు సుత్తీ, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ బైక్‌ ర్యాలీ సీమనాయుడు వలస జంక్షన్‌ నుంచి ప్రారంభమై పెదమేరంగి, సింగనాపురం చినకుదమ, తురకనాయుడువలస, లకనాపురం, రావివలస, కారివలస ,నాగూరు మీదుగా ఉల్లిభద్ర జంక్షన్‌ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అశోక్‌, పి.శంకరరావు,బి.వి రమణ, కరణం రవీంద్ర, గరుగుబిల్లి శ్రీను, కూరంగి సీతారాం,కాంగ్రెస్‌ నాయకులు బోను శంకర్రావు, ఎం వెంకట్‌ నాయుడు తదితరులు పాల్గన్నారు.

➡️