మత సామరస్యం కోసం నిలబడేది సిపిఎం : గఫూర్‌

Apr 24,2024 09:01 #cpm, #Ghafoor
  • రాజ్యాంగాన్ని కాషాయీకరణ చేస్తున్న బిజెపి : గఫూర్‌
  • కోలాహాలంగా సిపిఎం నెల్లూరు అభ్యర్థి రమేష్‌ నామినేషన్‌

ప్రజాశక్తి – నెల్లూరు : కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చివేసి కాషాయీకరణ చేస్తుందని, రాజ్యాంగంలోని సెక్యులర్‌ విధానాలను కాపాడుకోవాలంటే ఇండియా వేదిక అభ్యర్థులను తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఎంఎ.గఫూర్‌ అన్నారు. ఇండియా బ్లాక్‌ తరఫున నెల్లూరు నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా నగరంలోని ఎబిఎం కాంపౌండ్‌ నుంచి విఆర్‌సి సెంటర్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహిం చారు. సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గఫూర్‌ మాట్లాడుతూ.. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పోరాటం చేస్తోందని, మతసామరస్యం కోసం నిలబడుతోందన్నారు. రంగుల హరివిల్లు లాగా అనేక భాషలు, సంస్కృతులు ఉండే దేశంలో అధికారం కోసం అన్నదమ్ముల మధ్య తగాదాలు పెట్టి రాజకీయ లబ్ధిపొందాలని బిజెపి కుట్రలు పన్నుతోందని విమర్శించారు. బిజెపి దుర్మార్గపు పాలనను ఇండియా ఫోరమ్‌ గెలుపుతో అంతం చేయాలన్నారు. ప్రతి ఇంటికీ సందేశాన్ని తీసుకెళ్లి ఇండియా వేదిక అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మూలం రమేష్‌, కొప్పోలు రాజును గెలిపించాలని కోరారు.మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. నెల్లూరు పార్లమెంటు, సిటీ స్థానాలకు నిజాయతీ, నిబద్దత కలిగిన ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వారిని గెలిపించుకోవాలని కోరారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ.. అవినీతిమయమైన రాజకీయాల్లో నీతివంతమైన రాజకీయాలకు చిరునామాగా సిపిఎం ఉందని ఇటీవల బహిర్గతమైన ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహా రంలో బయటపడిందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ.. బిజెపిని ఓడించక పోతే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ డిసిసి అధ్యక్షులు చేవూరు దేవకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో పేద ప్రజల కలెక్టర్‌గా సేవచేసిన కొప్పోలు రాజును ఎంపిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిజాయతీపరుడైన మూలం రమేష్‌ను ఆదరించాలని కోరారు. మూలం రమేష్‌ మాట్లా డుతూ.. బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే దేశంలో మత విద్వేషాలు పెరిగిపోతాయన్నారు. మాజీ కలెక్టర్‌, పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పోలు రాజు మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే దేశంలో సమానత్వం అనేది కనుమరుగవుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. అనంతరం రిటర్నింగ్‌ అధికారి వికాస్‌ మర్మత్‌కు సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ తన నామినేషన్‌పత్రాలను అందజేశారు.

➡️