విఒఎ, ఆర్‌పిల సమస్యలు పరిష్కరించాలి- ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ

Jan 31,2024 21:35 #CM YS Jagan, #CPM AP, #letter, #VOA

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్‌లోను, పట్టణాల్లో మెప్మాలో, మహిళా సాధికారత సంస్థ గ్రామ, పట్టణ స్థాయిలో పనిచేస్తున్న విఒఎ, ఆర్‌పిల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. విఒఎ, ఆర్‌పిలతో రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి పనిచేయించుకుంటోందని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ మూడేళ్లు దాటిన వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విఒఎ, ఆర్‌పిలను రోడ్డన పడేస్తుందని తెలిపారు. వెంటనే సర్క్యులర్‌ను రద్దు చేయాలని కోరారు. కాలపరిమితిని రద్దు చేయాలని, హెచ్‌ఆర్‌పాలసీ అమలు చేయాలని, గ్రూప్‌ ఇన్సూరెన్సు పథకం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విఒఎల మెర్జ్‌ ఆపాలని ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నారని, వెంటనే వారి సంఘాల నాయకులను పిలిచి చర్చించి వారి కోర్కెలు పరిష్కరించాలని కోరారు. లక్షలాది మంది పేద మహిళలను కూడగట్టి, పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను నిరంతరం శ్రద్ధతో నిర్వహిస్తున్నారని, 18 రకాల మొబైల్‌ యాప్స్‌ ద్వారా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వర్క్‌తో పనిభారం తీవ్రమైందని పేర్కొన్నారు. మొబైల్స్‌, నెట్‌ బ్యాలెన్సు ఇవ్వకపోవడంతో సొంత డబ్బులే ఖర్చు చేస్తున్నారని, డ్వాక్రా సభ్యులతో మహిళా మార్టుల్లో సరుకుల కొనుగోళ్లకు టార్గెట్స్‌ పెట్టి విఒఎలతో బలవంతపు అమ్మకాలు చేయిస్తున్నారని అన్నారు. ఆర్‌పిలకు వేతన గ్యారెంటీ కూడా లేదని, పెర్ఫార్మెన్స్‌ పేరుతో కొద్ది అమౌంట్‌ చేతిలో పెడుతున్నారని వివరించారు. ఇన్ని బాధ్యతలు నెరవేర్చుతున్నా విఒఎ, ఆర్‌పిల సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుని వారి సమస్యలు పరిష్కరించడం లేదని పేర్కొన్నారు. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని, విద్యుత్‌ ఛార్జీలు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరిగి కుటుంబ జీవనం భారంగా మారిందని వివరించారు. వెంటనే కాలపరిమితి సర్క్యులర్‌ రద్దుచేసి, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని కోరారు. 10 లక్షల గ్రూపు ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలని, మెర్జ్‌ ఆపాలని, 15 సంఘాలలోపు ఉన్న విఒఎలకు ప్రభుత్వమే వేతనం చెల్లించాలని కోరారు. ఉపాధి కోల్పోయిన విఒఎలకు నష్టపరిహారం ఇవ్వాలని, కొత్తగా ఏర్పాటుచేసిన గ్రామ సమాఖ్యల విఒఎలకు వేతనాలు ఇవ్వాలని కోరారు. బ్యాంకు అకౌంట్‌ సరిగ్గా లేవన్న పేరుతో రెండున్నరవేల మందికి చాలా కాలంగా వేతనాలు వేయలేదని, ఆ బకాయిలు చెల్లించాలని, పొదుపు సంఘాలకు రూ.5 లక్షలకు వడ్డీ రాయితీ ఇవ్వాలని, రూ.20 లక్షల వరకు సున్నా వడ్డీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. డ్వాక్రా సభ్యులతో బలవంతపు కొనుగోళ్లు చేయించొద్దని, ఈ సమస్యలన్నిటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కరించాలని కోరారు.

➡️