ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి : సిఎం జగన్ కు సిపిఎం లేఖ

– కొద్దిపోస్టులకే నోటిఫికేషన్‌ సరికాదు

– ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ ప్రకటించి, నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఐదేళ్లుగా ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, గ్రూప్‌ా1, 2 ఉద్యోగార్థుల్లో కొద్దిమంది వయసు మీరిపోయిన వారూ ఉన్నారని పేర్కొన్నారు. వేలాది పోస్టులు ఖాళీలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 7న గ్రూపుా2లో 897 పోస్టులకు, 8న గ్రూప్‌-1లో 81 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వడంతో లక్షలాది మంది నిరుద్యోగులు నిరాశ చెందారని వివరించారు. మెగా డిఎస్‌సి ప్రకటిస్తామని ఊరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ప్రకటించలేదని, రాష్ట్రంలో 18 వేల టీచర్‌పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 40 వేలు ఖాళీలున్నాయని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం 12 వేల మంది రిటైర్డు అవుతారని, ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు నింపుతామని, మెగా డిఎస్‌సి ప్రకటిస్తామని, గిరిజన యువతకు ప్రత్యేక డిఎస్‌సి వేస్తామని ఇచ్చిన హామీ ఇంత వరకు నెరవేరలేదని పేర్కొన్నారు. ఏజెన్సీ భాషా వలంటీర్లు నాలుగున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్నా వారిని రెగ్యులరైజ్‌ చేయలేదని తెలిపారు. వేలాది పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 411 ఎస్‌ఐ, 6,100 కానిస్టేబుల్‌ పోస్టులకే నోటిఫికేషన్‌ ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024 జాబ్‌ కేలండర్‌ ప్రకటించాలని, ఫిబ్రవరి నాటికి పోస్టులన్నీ భర్తీ అయ్యేట్లు టైమ్‌టేబుల్‌ ప్రకటించి భర్తీ చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న గ్రూపు -1, 2 పోస్టులను ప్రకటించి, ఫిబ్రవరిలోగా భర్తీ చేయాలని, వయోపరిమితి అర్హతను 47 ఏళ్లకు పెంచాలని కోరారు. మెగా డిఎస్‌సి ప్రకటించి ఖాళీలున్న టీచర్‌ పోస్టులన్నీ భర్తీ చేయాలని, గిరిజన యువతకు ప్రత్యేక డిఎస్‌సి ప్రకటించాలని ఏజెన్సీ భాషా వలంటీర్లను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేయాలని కోరారు. అలాగే 2024 పూర్తిస్థాయి జాబ్‌ కేలండరు ప్రకటించాలని లేఖలో కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ స్టడీసర్కిల్స్‌ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

 

➡️