సిపిఎం ముమ్మర ప్రచారం

Apr 26,2024 23:05 #cpm, #pracharam

– బిజెపికి ఓటుతో బుద్దిచెప్పండి
– ప్రజా సమస్యలపై పోరాడే అభ్యర్థులను గెలిపించండి
ప్రజాశక్తి-యంత్రాంగం :సిపిఎం అభ్యర్థుల ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా గత పాలకుల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. వాడవాడలా తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నిరంతర ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపిని, ఆ పార్టీకి మద్దతిస్తున్న టిడిపి, జనసేన, వైసిపిలకు ఓటుతో బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నిడమర్రు, బేతపూడి, కురగల్లులో నియోజకవర్గం అభ్యర్థి శివశంకరరావు శుక్రవారం ఇంటింటి ప్రచారం చేశారు. రాజధాని, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, రైతులు, అనేక సమస్యలపై సిపిఎం చేసిన పోరాటాలను చెప్పి తమను బలపర్చాలని కోరారు. చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. తాడేపల్లి పట్టణంలోని ఇఎస్‌ఐ ఆస్పత్రి, ఉండవల్లి, ఇప్పటంలో జన్నా శివశంకరరావు గెలుపు కోరుతూ సిపిఎం నేతలు ప్రచారం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం మండలం బందులుప్పి, పులుగుమ్మి, జమ్మిడివలస గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చి అడవులను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. జిఒ నెంబర్‌ 3 ద్వారా దక్కాల్సిన ఉద్యోగాలను దక్కకుండా చేసి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఉపాధి లేక గిరిజన యువత వలస పోతున్నారని, గిరిజన గ్రామాల్లో వైద్యం అందని ద్రాక్షగా మారిందని తెలిపారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు గిరిజన భూములను అదానీకి హైడ్రో ఎలక్ట్రిసిటీ విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం కట్టబెడుతున్నారని అన్నారు. హక్కులు సాధించుకోవడానికి, గిరిజన ప్రాంతాన్ని రక్షించుకోవడానికి సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్‌ పరిధిలోని 36వ వార్డు డ్రైవర్స్‌ కాలనీ, వాసవి నగర్‌, గోపి నగర్‌, రాధానగర్‌, గురుబ్రహ్మ కాలనీల్లో పాణ్యం అభ్యర్థి గౌస్‌దేశారు ప్రచారం నిర్వహించారు. అభివృద్ధిని విస్మరించి కబ్జాలు, దౌర్జన్యాల ద్వారా ఆస్తులను పెంచుకుంటున్న వారిని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. 21వ వార్డు పార్థసారధి నగర్‌, పాణ్యం, గడివేముల మండలాల్లో గౌస్‌దేశారుని గెలిపించాలని కోరుతూ ఆ ప్రార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి. నెల్లూరు 49, 50వ డివిజన్లలో ఎమ్మెల్యే అభ్యర్థి మూలం రమేష్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి నిరంకుశ పాలన సాగిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బిజెపికి మద్దతిస్తున్న టిడిపి, జనసేన, వైసిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను బలపరచాలని కోరారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని తరిగొప్పల, మానికొండ, నందమూరు, వేంపాడు, చాగంటిపాడు, చికినాల, బకినాల గ్రామాల్లో సిపిఎం గన్నవరం నియోజకవర్గం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ మచిలీపట్నం ఎంపి అభ్యర్థి గొల్లు కృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మతోన్మాద బిజెపిని గద్దె దించాలని, బిజెపికి మద్దతు తెలుపుతున్న పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇండియా వేదిక నాయకత్వంలో ప్రజా పరిపాలన వచ్చేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ 27, 36 డివిజన్లలో సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. అల్లూరి సీతారామరాజు బ్రిడ్జి నుంచి ప్రారంభమైన ప్రచారం డిమార్టు ఏరియా తదితర ప్రాంతాల్లో సాగింది. విజయవాడ అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. విశాఖలోని వంటిల్లు జంక్షన్‌, సింహగిరికాలనీ, నవాబునగర్‌, శివాజీనగర్‌, అజీమాబాద్‌, ఇందిరాకాలనీ, సీతారాంనగర్‌ కాలనీ, బిసి రోడ్డు, కొత్తగాజువాక ప్రాంతాల్లో గాజువాక నియోజకవర్గం అభ్యర్థి ఎం.జగ్గునాయుడు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తాను గెలిస్తే చేయబోయే పనులను జగ్గునాయుడు వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, దేవీపట్నం, విఆర్‌.పురం, జికె.వీధి, డుంబ్రిగుడ, పెదబయలు, చింతపల్లి మండలాల్లో అరకు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స, రంపచోడవరం అభ్యర్థి లోతా రామారావు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేశారు.

➡️