సిపిఎం నాయకుల అక్రమ అరెస్టులకు ఖండన

cpm on illegal arrests
ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటన సందర్భంగా సిపిఎం, ప్రతిపక్ష నాయకులు, అక్రమ అరెస్టులను, ముందస్తు గృహ నిర్భందాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండించింది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాంను, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్‌ను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించటం గర్హనీయమని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.వాసుదేవరావును ఉండిలో ఇంటి వద్దనే గృహనిర్భంధం చేశారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సిపిఎం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వామపక్ష నాయకులను ఇదే రీతిలో ముందస్తు అక్రమ అరెస్టులు, గృహ నిర్భంధం చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంలో సిపిఎం, వామపక్ష, ప్రజా సంఘాల నాయకులను అక్రమ ముందస్తు అరెస్టులు చేయడం రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయిందని ఆగ్రహించారు. ఈ అరెస్టులను ప్రజాతంత్ర వాదులందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు.  తక్షణం అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
➡️