11న ఎస్‌బిఐల ముందు నిరసన- సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు

-ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలని డిమాండ్‌

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ ఈ నెల 11వ తేదీన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) బ్రాంచ్‌ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు, గత నాలుగేళ్లలో అమ్మిన బాండ్లు, వాటిని కొన్న వారి సమస్త సమాచారాన్ని ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోగా బ్యాంకు అందించాలని, 13వ తేదీలోగా ఆ వివరాలను ఎన్నికల కమిషన్‌ బహిర్గతపరచాలని సుప్రీంకోర్టు తీర్పులో ఆదేశించిందని ఆయన తెలిపారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఎస్‌బిఐ విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ఆ సమాచారాన్ని ఇవ్వడానికి ఎస్‌బిఐకి ఇచ్చిన మూడు వారాల గడువు ముగిసిందని పేర్కొన్నారు. ఆ వివరాలు వెల్లడించడానికి బదులు ఎస్‌బిఐ గడువు ముగుస్తున్న తరుణంలో మరో 116 రోజులు అదనపు గడువు కావాలని కోర్టును ఆశ్రయించి, జూన్‌ 30 కల్లా కోరిన సమాచారమంతా అందజేస్తామని తెలిపిందని పేర్కొన్నారు. అంటే ఎన్నికలు ముగిసేవరకూ బాండ్ల వివరాలు వెల్లడించకుండా పన్నాగం పన్నిందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. తన కార్యాకలాపాలన్నిటినీ డిజిటలైజ్‌ చేసిన ఎస్‌బిఐ ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను కొద్దిరోజుల్లో పొందుపరిచి ఇవ్వలేక పోయిందంటే నమ్మశక్యంగా లేదని తెలిపారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిళ్ల కారణంగానే ఎస్‌బిఐ సహించరాని ఈ వైఖరి తీసుకుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను ఎస్‌బిఐ అందజేసేలా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. వెంటనే ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

➡️