CAA: సిఎఎపై మీ వైఖరేంటి?

CPM State Secretary direct question to YCP, TDP, Janasena

వైసిపి, టిడిపి, జనసేనలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సూటి ప్రశ్న
అమలు చేయబోమని వైసిపి ప్రభుత్వం ప్రకటించాలి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముస్లిమ్‌ మైనార్టీల ఉనికిని దెబ్బకొట్టి వారి భవిష్యత్‌ను అంధకారం చేస్తున్న సిఎఎ (పౌరసత్వ సవరణ చట్టం) రూల్స్‌ నోటిఫై చేసి దేశాన్ని ప్రమాదంలోకి నెట్టిన బిజెపి కుతంత్రాలపై రాష్ట్రంలో వైసిపి టిడిపి జనసేన పార్టీలు ఎందుకు నోరెత్తడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సిఏఏ అమలు చేయబోమని వైసిపి ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మైనార్టీలను ఉద్దరిస్తానని రోజూ రాగాలు తీసే సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సిఎఎ ద్వారా ముస్లిమ్‌ మైనార్టీల ఉనికిని దెబ్బతీయడంలో బిజెపిని బలపరిచిన తెలుగుదేశం పార్టీది నేరం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మైనార్టీలపై మెజార్టీ మతస్తులను రెచ్చగొట్టి ఉద్రిక్తతలను సృష్టించాలనుకున్న బిజెపితో కలిసి తెలుగుదేశం లౌకికవాదం ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు. బిజెపి దురాగతాలను ప్రశ్నించకుండా వైసిపి మైనార్టీలను ఎలా రక్షిస్తుందో చెప్పాలన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం కులం, మతం, రంగు, జాతి, ప్రాంతం, భాష అధారంగా ఎవరిపట్ల వివక్ష ఉండకూడదని, కానీ సిఎఎ మత ప్రాతిపదికన వివక్ష పాటిస్తోందని తెలిపారు. రాజ్యాంగంలోని 19వ అధికరణం మతపరమైన స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు ముస్లిములకు తప్ప ఇతరులకు పౌరసత్వం ఇస్తామని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా మతమపరమైన హింసను ఎదుర్కొన్న శ్రీలంక హిందువులను ఎందుకు మినహాయించారని ప్రశ్నించారు. పొరుగుదేశాల్లో మతపరమైన హింసకు గురవుతున్న ప్రజలను మానవతా దృష్టితో ఆదుకునేందుకే ఈ చట్టం తెచ్చినట్లయితే కేవలం మూడు దేశాలకే ఎందుకు పరిమితం చేయాల్సి వచ్చిందో తెలపాలని పేర్కొన్నారు. మయన్మార్‌లో మైనార్టీలైన రొహింగ్యా ముస్లిములు, శ్రీలకంలో హిందువులు,క్రైస్తవ తమిళులు తీవ్రమైన హింసాకాండకు గురయ్యారని వారిని ఎందుకు ఈ చట్టంలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తే కేంద్ర పభుత్వం వద్ద సమాధానం లేదని పేర్కొన్నారు. చివరకు పాకిస్తాన్‌ ముస్లిములతో అనేక మైనార్టీ తెగలు తీవ్రమైన హింసాకాండకు గురవుతున్నాయని, బిజెపి మానవతా జాబితాలో వారిని ఎందుకు చేర్చలేదో చెప్పాలని డిమాండు చేశారు. వీటన్నిటినీ పరిశీలిస్తే దీనివెనుక మానవత లేదని, రాజకీయవ్యూహంతో ఇదంతా చేస్తోందని అర్థమవుతుందని పేర్కొన్నారు. వామపక్షాల మద్దతుతో ఇండియా బ్లాక్‌ అధికారంలోకి వస్తే సిఎఎ అమల్లోకి రాదని, అదే మైనార్టీలకు రక్ష, మత సామరస్యానికి గ్యారంటీ అని శ్రీనివాసరావు తెలిపారు.

➡️