దాడిపై దళితుల నిరసన

  • కోడ్‌ నేపథ్యంలో ధర్నా విరమించాలని కోరిన సిఐ
  •  నిందితుల్లో పదిమందిని అదుపులోకి తీసుకున్నామని ప్రకటన

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ : రాజమహేంద్రవరం రూరల్‌ కడియం మండలం కడియపు సావరంలో దళిత యువకులపై జరిగిన దాడిని నిరసిస్తూ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళితులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కడియం పోలీస్‌స్టేషన్‌ ఎదుట దళిత సంఘాలు, రిపబ్లికన్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు యత్నించారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ధర్నాను విరమించాలని పోలీసులు వారిని కోరారు. దీంతో సిఐతో చర్చలు సాగించారు. ఈ సందర్భంగా కడియం సిఐ తులసీధర్‌ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిలో పదిమందిని అదుపులోకి తీసుకున్నామని, ఇంకా దాడిలో ప్రమేయం ఉన్న వారి పాత్రపై విచారణ జరుగుతుందన్నారు. వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు. గ్రామంలోని సిసి పూటేజీని విశ్లేషిస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా గ్రామంలో అన్ని సామాజిక తరగతుల ప్రజలూ సహకరించాలని కోరారు. ప్రస్తుతం దాడి ఘటనపై డిఎస్‌పి అంబికా ప్రసాద్‌ విచారణ చేస్తున్నారని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో దళితులు ఆందోళనను విరమించారు. సిఐతో జరిగిన చర్చల్లో బిఎస్‌పి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజరుకుమార్‌, కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు, బిఎస్‌పి రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కొండపల్లి సూరిబాబు, బిఎస్‌పి రూరల్‌ అధ్యక్షుడు జుత్తుగ రాజేష్‌, రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా వెంకటరత్నం రాజు, రాష్ట్ర నాయకులు కోనాల లాజర్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు శీలం నరసింహ, రేగుళ్ల కార్తీక్‌, రేగుళ్ల సురేష్‌లకు వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్న శీలం రాజేష్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడికి సంబంధించిన వివరాలను డిఎస్‌పి ప్రసాద్‌ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి నమోదు చేసుకున్నారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని, తరువాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులను కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు తదితరులు పరామర్శించారు.

దళితులపై దాడులు అమానుషం : సిపిఎం
దళిత యువకులపై పెత్తందార్ల యువకుల దాడి అమానుషమని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్‌ అన్నారు. దాడికిపాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బాధితులకు మెరుగైన సాయం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️