స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తున్నబిజెపిని, దాని మిత్రపక్షాలను ఓడించండి

– విశాఖలో కార్మిక, ప్రజా సంఘాల నాయకుల పిలుపు
– ఉక్కు జెఎసి దీక్షా శిబిరానికి మూడేళ్లు
ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తున్న బిజెపికి, దానికి సహకరిస్తున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జెఎసి నాయకులు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద తలపెట్టిన దీక్షలు మంగళవారంతో మూడేళ్లుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద భారీ నిరసన దీక్ష చేపట్టారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి, విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జెఎసి చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు, ఐఎన్‌టియుసి రాష్ట్ర కార్యదర్శి, జెఎసి చైర్మన్‌ ఎం. రాజశేఖర్‌, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించనున్నట్టు కేంద్రంలోని మోడీ సర్కారు ప్రకటించినప్పటి నుంచీ విశాఖలో ఆందోళనలు కొనసాగుతున్నాయన్నారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి కార్మిక వర్గం, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థి, యువజన, మహిళా, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివస్తూ మూడేళ్లుగా పోరాటాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడాన్ని అభినందించారు. అనేక రూపాల్లో జెఎసి నిర్వహించిన ఉద్యమాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా విశాఖ ప్రజలు పాల్గని విజయవంతం చేశారన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం నిలబడే పార్టీలను గెలిపించుకోవాలని కోరారు. లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టిన దొంగలు రాష్ట్రంలో పోటీచేస్తున్నారని, వారిని చిత్తుగా ఓడించి ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వ రంగాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలు కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️