ఢిల్లీ లిక్కర్‌ స్కాం – నేడు సుప్రీం కోర్టులో కవిత పిటిషన్‌ పై విచారణ

తెలంగాణ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు ఇచ్చిన విషయం విదితమే. అయితే తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించారని కోరుతూ ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

మద్యం కేసులో కవిత గతేడాది మార్చిలో ఈడీ ఎదుట చాలాసార్లు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సిబిఐ ఆమెను సాక్షిగా విచారించింది. తాజాగా కవితను లిక్కర్‌ స్కామ్‌ లో నిందితురాలిగా పేర్కొంటూ సిబిఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 41ఏ కింద విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు సమన్లు వచ్చాయి. దీంతో కవిత మళ్లీ సిబిఐ, ఈడీ ఎదుట హాజరుకావాలా వద్దా అనే అంశంపై నేడు సుప్రీంకోర్టులో జరగనున్న విచారణ కీలకంగా మారనుంది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఢిల్లీ సిఎం, ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ ఇటీవల వరుసగా సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈకేఎస్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అరెస్టయ్యారు.

➡️