బిజెపిని ఓడించకపోతే ప్రజాస్వామ్య మనుగడ కష్టం

Apr 24,2024 22:45 #Parakala Prabhakar, #speech

– ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌
ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ :నియంతృత్వ బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని, లేదంటే దేశం ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతుందని ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ అన్నారు. బిజెపిని ఓడించకపోతే ప్రజాస్వామ్య మనుగడ కష్టమని తెలిపారు. ‘సంక్షోభంలో రాజ్యాంగాం ఆర్థిక, రాజకీయ మూలాలు’ అనే అంశంపై రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ హాల్లో బుధవారం సెమినార్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గన్న పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ..దేశంలో ఒకవైపు నిరుద్యోగం గణనీయంగా పెరిగిపోయిందని, 87.83 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పారు. నిరుద్యోగిత ఈ స్థాయిలో ఉండడం దేశ భవిష్యత్తుకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. ఇటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో దేశంలోని యువత రష్యా, ఉక్రెయిన్‌ వంటి దేశాలకు కిరాయి సైనికులుగా వెళ్లి ప్రమాదంలో పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను శాస్త్రీయంగా, సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం మూఢ నమ్మకాల వైపు తీసుకువెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోడీ నేడు నిరుద్యోగ సమస్యపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ప్రజల వద్ద కేవలం 40 శాతం మాత్రమే సంపద ఉంటే ప్రపంచంలో భారతదేశం ఐదో ఆర్థిక వ్యవస్థ ఎలా అవుతుందని ప్రశ్నించారు. నిత్యావసర ధరల పెరుగుదల, ఆకలి సూచికలో దేశం 120 స్థానాల్లో ఉందన్నారు. ప్రతి సంవత్సరం భారతదేశ పౌరసత్వం వదులుకొని విదేశాలకు వెళ్లిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో భారతదేశం నుంచి రెండు లక్షల ఇరవై రెండు వేల మంది విదేశాలకు వెళ్లిపోయారని వివరించారు. ఎటువంటి చర్చా లేకుండా పార్లమెంట్‌లో మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టడం అన్నదాతలను ఆందోళనకు గురిచేసిందని, తాజాగా ఉపాధి హామీ చట్టాన్ని కూడా నీరుగారుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా లాయర్స్‌ అసోసియేషన్‌ యూనియన్‌ నాయకులు దిగుబడి రాజగోపాల్‌, కామన మునిస్వామి, దళిత ఐక్యవేదిక నాయకులు గంటా సుందర్‌కుమార్‌, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కరీముల్లా బాష తదితరులు పాల్గొన్నారు.

➡️