మృతదేహంతో కార్మికుల ధర్నా

Dharna of workers with dead bodies

న్యాయం చేస్తామని అధికారుల హామీ

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : చెత్త తరలింపు ట్రాక్టర్‌ ఢకొీట్టడంతో మృతి చెందిన పారిశుధ్య కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మృతదేహంతో మున్సిపల్‌ కార్మికులు బుధవారం ధర్నాకు దిగారు. విధులు బహిష్కరించి పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, రెండు సెంట్ల స్థలంతోపాటు కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నానుద్ధేశించి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.సాల్మన్‌, జిల్లా గౌరవాధ్యక్షులు సిలార్‌ మసూద్‌ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుడు దేపంగి కోటయ్య విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఈ నెల 17న ప్రమాదవశాత్తు చెత్త తరలింపు ట్రాక్టర్‌ ఢకొీందని, అప్పటి నుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం మృతి చెందారని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఉదయం 6 గంటల నుండి ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. కమిషనర్‌ సి.రవించంద్రరెడ్డి ధర్నా వద్దకు వచ్చి నాయకులతో మాట్లాడారు. డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు హామీ ఇచ్చారు. లిఖిత పూర్వక హామీకి పట్టుబట్టడంతో రూ.20 లక్షల పరిహారం, రెండు సెంట్ల ఇంటి స్థలం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి పారిశుధ్య విభాగంలో అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగం ఇస్తామని లిఖితపూర్వకంగా కమిషనర్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

➡️