డాక్టర్‌ త్రిపుర సుందరి ఇకలేరు

  • సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం
  •  రేపు హైదరాబాద్‌లో అంత్యక్రియలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సిపిఎం అగ్రనేత మాకినేని బవసపున్నయ్య కోడలు, ప్రజావైద్యులు డాక్టర్‌ త్రిపుర సుందరి సోమవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా పార్కిన్సన్స్‌తో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యారు. పరిస్థితి విషమించి సోమవారం తుదిశ్వాస విడిచారు. త్రిపుర సుందరి మాకినేని బసవపున్నయ్య కుమారుడు డాక్టర్‌ జస్వంత్‌ మోహన్‌ భార్య. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వసంత్‌, చిన్న కుమారుడు శిశిర్‌. వసంత్‌ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. శిశిర్‌ హైదరాబాద్‌లోనే తల్లికి సేవలందించారు. అలాగే త్రిపుర సుందరి సోదరులు డాక్టర్‌ కళాధర్‌ గుంటూరులో ప్రముఖ వైద్యులు. త్రిపుర సుందరిది రేపల్లె తాలూకా పెదపులివర్రు. గుంటూరు మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. గైనిక్‌లో స్పెషలైజేషన్‌ చేశారు. నెల్లూరు ప్రజావైద్యశాలలో నాలుగేళ్లు పనిచేశారు. జస్వంత్‌తో వివాహం అనంతరం డాక్టర్‌ వెంకటరత్నం భార్య విజయకుమారితో కలిసి గుంటూరులో ప్రజావైద్యశాలను ప్రారంభించారు. అనంతరం జస్వంత్‌ చైనావెళ్లి ఆక్యుపంక్చర్‌లో శిక్షణ పొందారు. తిరిగి వచ్చిన తరువాత 1982లో విజయవాడలో ప్రాక్టీసు ప్రారంభించారు. ఈ నెల 20న హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.
శ్రీనివాసరావు, రమాదేవి సంతాపం
మాకినేని త్రిపుర సుందరి మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పూర్వ కార్యదర్శి పి మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. వైద్యురాలిగా ప్రజాసేవ చేయడమే కాకుండా కమ్యూనిస్టు అభిమానిగా జీవిత చరమాంకం వరకూ ఉన్నారని తెలిపారు. సహృదయం, సేవాదృక్పథం ఆమె వ్యక్తిత్వానికి వన్నె తెచ్చాయని పేర్కొన్నారు. పుట్టినింట, మెట్టినింట కమ్యూనిస్టు రాజకీయ ప్రభావం ఉండేదని, నిరంతరం రాజకీయాలను పరిశీలించేవారని తెలిపారు. బసవపున్నయ్య భార్య జగదాంబ చివరి వరకూ ఆమె వద్దే ఉన్నారని పేర్కొన్నారు.

➡️