ఎన్‌డిఎ హమీలు నమ్మొద్దు

Apr 13,2024 07:56 #ap cm jagan, #speech

-ఆ కూటమి అబద్దాలు చెబుతుంది
– గుంటూరులో సిఎం జగన్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:ఎన్‌డిఎ కూటమి ఇచ్చే హామీలను నమ్మవద్దని ప్రజానీకానికి వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గుంటూరు రూరల్‌ మండలం ఏటుకూరు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ‘మేమంతా సిద్దం’ ఎన్నికల ప్రచార సభలో పాల్గన్న ఆయన, మాట్లాడుతూ 2014 నుంచి2019 వరకు రాష్ట్రంలో ఎన్‌డిఎ పాలన జరిగిందని చెప్పారు. అప్పట్లో టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదన్నారు. 2019 ఎన్నికల్లో ఇదే విషయమై మూడు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయని చెప్పారు. ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తే గెలవలేమని మళ్లీ కూటమిగా వస్తున్నారన్నారు. ఎన్‌డిఎ కూటమి అబద్దాలను ప్రచారం చేస్తోందని, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, పురందేశ్వరీ మాటలు నమ్మి, వారికి ఓటు వేయవద్దని కోరారు. ఎన్‌డిఎ కూటమి 2014లో రైతుల రుణమాఫీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ. 25వేల బ్యాంకులో డిపాజిట్‌, నిరుద్యోగ భఅతి, రాష్ట్రాన్ని సింగపూర్‌కి మించి చేస్తామంటూ చెప్పాయని, వాటిలో వేటిని అమలు చేశారో ఆలోచించాలని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి, సంక్షేమ పథకాలను గత ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిందని చెప్పారు. ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు డిబిటి ద్వారా ప్రజల ఖాతాలకు జమ చేశామన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగుతాయని హెచ్చరించారు. అంతకు ముందు పల్నాడు జిల్లా దూళిపాళ్ల నుంచి గుంటూరు జిల్లా ఏటుకూరు వరకు ఆయన బస్సు యాత్ర కొనసాగించారు. యాత్రలో పెద్ద సంఖ్యలోపాల్గన్నారు. సత్తెనపల్లి, మేడికొండూరు, పేరేచర్ల, నల్లపాడు, హౌసింగ్‌ బోర్డు కాలనీ, చుట్టుగుంట మీదుగా ఏటుకూరు చేరుకున్నారు.
సిద్ధం సభకు వర్షం దెబ్బ
సభ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అవుతుందని ప్రకటించారు. అయితే వర్షం కారణంగా సిఎం సభ మూడు గంటలకు పైగా ఆలస్యంగా జరిగింది. రాత్రి 6.50 గంటలకు సిఎం సభా వేదికపైకి వచ్చారు. భారీ వర్షంతో సభా ప్రాంగణం మొత్తం చిత్తడిగా మారింది.వచ్చిన ప్రజలు సగానికిపైగా వెళ్లిపోయారు. హోర్డింగ్‌లు, బ్యానర్లు, కటౌట్‌లు కప్పకూలాయి. సభా ప్రాంగణంలో నీరు నిలిచింది. దీంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు చాలా మంది బస్సుల్లోనే ఉండిపోయారు. అనంతరం ప్రసంగించిన సిఎం 20 నిమిషాలలోనే ముగించారు.
వైసిపిలో చేరిన సీమ నేతలు
పల్నాడు జిల్లా దూళిపాళ్లలో బస చేసిన సిఎం జగన్‌ క్యాంపు స్థలం వద్ద శుక్రవారం పలువురు టిడిపి, బిజెపి నాయకులు వైసిపిలో చేరారు. కర్నూలు జిల్లా ఆలూరుకి చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎం పద్మజ, కోడుమూరు నియోజకవర్గం టిడిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బిజెపికి చెందిన ఆలూరు నియోజకవర్గం నేత, మాజీ మేయర్‌ శశికళ, ఆంధ్రప్రదేశ్‌ కురవ సంఘం గౌరవ అధ్యక్షులు కఅష్ణమోహన్‌కు సిఎం జగన్‌ వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️