ఉదారంగా సాయం అందించాలి

 

-అధికారులకు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

– పొలాల్లో నీటి తరలింపు కీలకం

-80 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో వరద ప్రాంతాల్లో బాధితులను ఉదారంగా ఆదుకోవాలని, పొలాల్లో నీతి తరలింపు అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మిచౌంగ్‌ తుపాను అనంతరం పరిస్థితులపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఎస్‌పిలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. అధికారులందరూ ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై దృష్టి పెట్టాలని అన్నారు. బాధితుల పట్ల ఉదారంగా, సానుభూతితో వ్యవహరించాలని, మంచి సాయం అందించాలని సూచించారు. వర్షాల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.10 వేలు సాయం ఇచ్చే విషయంలోనూ, ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల వారిని క్యాంపులకు తీసుకొచ్చి వారిని జాగ్రత్తగా చూసుకోవడంలోనూ, క్యాంపుల నుండి తిరిగి ఇళ్లకు వెళుతున్న సమయంలోనూ వారికి ఇవ్వాల్సిన సాయం అందించాలని తెలిపారు. రేషన్‌ పంపిణీలో ఎలాంటి లోపమూ ఉండకూడదని స్పష్టం చేశారు. పొలాల్లో నీటి తరలింపునకు అవసరమైన అన్ని రకాల పరికరాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రతి ఆర్‌బికెకు ఎస్‌ఒపి జారీచేశారని, రైతుకు కచ్ఛితమైన భరోసా ఇవ్వాలని తెలిపారు. పంటల రక్షణ, పరిహారం అందించడం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుండి అన్ని రకాలుగా రైతుకు ప్రతి అడుగులోనూ తోడుగా ప్రభుత్వం ఉంటుందని పేర్కొన్నారు. 88 శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరాకు అన్ని రకాలుగానూ సిద్ధంగా ఉండాలని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ సరఫరా పనులు చేపట్టాలని పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యంపైనా దృష్టి పెట్టాలని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.30 లక్షలు సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో ఉన్న వలంటీర్‌ దగ్గర నుండి సచివాలయ సిబ్బంది మొదలుకుని ప్రభుత్వంలో పైస్థాయిలో ఉద్యోగి వరకు ఎలాంటి ఇబ్బంది జరిగినా ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని పేర్కొన్నారు. వారిలో ఆత్మస్థైర్యం నింపే పని ప్రభుత్వం చేస్తుందని వివరించారు.

➡️