ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు – విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

May 21,2024 21:40 #ukkunagaram, #visaka steel plant

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ కుట్రలో భాగంగా ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేసి వారి సహనాన్ని పరీక్షిస్తే స్టీల్‌ యాజమాన్యం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 1195వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ ఎఫ్‌ఎండి, ఆర్‌ఎస్‌ అండ్‌ ఆర్‌ఎస్‌, విఎస్‌జిహెచ్‌, ప్లాంట్‌ డిజైన్‌ విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, విల్లా రామ్మోహన్‌ కుమార్‌, డిసిహెచ్‌.వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు మాట్లాడారు. స్టీల్‌ యాజమాన్య వైఖరిని ఖండిస్తూ బుధవారం అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డెడికేషన్‌ పార్కు వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర బిజెపి పాలనలో నియమితులైన స్టీల్‌ సిఎమ్‌డి, డైరెక్టర్లపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. డైరెక్టర్లు, ఉన్నతాధికారులు అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడంలేదని, యథేచ్ఛగా షికార్లు చేస్తున్నారని, దీనిపై స్పందించకపోవడం ఉక్కు మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీను, మధు, పిఆర్‌కె.రాజు, గుమ్మడి నరేంద్ర, శ్రీనివాస్‌ నాయుడు, దాసరి శ్రీనివాస్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️