ఇంటింటికీ మస్కా పథకం ‘మోడీ గ్యారెంటీ’

May 7,2024 00:59 #2024 election, #cpm, #V.Srinivas rao
  •  ఏజెన్సీలో సిపిఎం అభ్యర్థులను గెలిపించండి : వి. శ్రీనివాసరావు
  •  రాజవొమ్మంగిలో బహిరంగ సభ, ర్యాలీ

ప్రజాశక్తి – రాజవొమ్మంగి / రంపచోడవరం విలేకరులు (అల్లూరి జిల్లా) : ఇంటింటికీ మస్కా పథకం మోడీ గ్యారంటీ అని, ప్రజలను మోసం చేస్తున్న బిజెపి, టిడిపి, వైసిపిలను ఓడిస్తేనే ప్రజలకు రక్షణ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆ పార్టీలను మళ్లీ గెలిపిస్తే ఎపికి ప్రత్యేక హోదా రాదని అన్నారు. పేద ప్రజలు, కార్మికులు, గిరిజనులు హక్కులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు, అరకు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సలను గెలిపించాలని కోరుతూ సోమవారం రాజవొమ్మంగి నూకాలమ్మ గుడి సమీపంలో సిపిఎం మండల నాయకులు కొండ్ల సూరిబాబు అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సిపిఎం అభ్యర్థులు గెలిస్తే అసెంబ్లీ, పార్లమెంట్‌లో ప్రజల గళం వినిపిస్తారన్నారు. మోడీకి జగన్‌, బాబు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. గడిచిన పదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమైనా ఉంటే చెప్పాలని సవాలు విసిరారు. ప్రజలకు ఏమీ చేయకుండా ఇప్పుడు దేవుడు పేరు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితికి బిజెపి ప్రభుత్వం వచ్చిందన్నారు. ప్రజల మధ్య కుల, మత చిచ్చుపెట్టి దేశంలోని విలువైన సంపదలను అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకు కుట్రలు సాగుతున్నాయని విమర్శించారు. ప్రజల భూములను లాక్కునేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను మోడీ ప్రభుత్వం ప్రవేశపెడితే దానికి రాష్ట్రంలోని టిడిపి, వైసిపి ప్రభుత్వాలు అసెంబ్లీలో బల్లలు గుద్ది తలలూపిన విషయాన్ని గుర్తుచేశారు. టిడిపి గెలిస్తే రాష్ట్రంలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెబుతున్న లోకేష్‌.. ఏ విధంగా ఇస్తారన్న ప్రణాళికను మాత్రం ప్రకటించడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి, వైసిపిలను గెలిపిస్తే పరిపాలన ఇక్కడ గెలిచిన ముఖ్యమంత్రి చేయరని, ఢిల్లీ నుంచి బిజెపి పెద్దలు చేస్తారని, ఇక్కడి వారు కేవలం రబ్బర్‌ స్టాంపులుగానే ఉంటారని తెలిపారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వైసిపి, టిడిపి, బిజెపి అభ్యర్థులు గెలిస్తే జరిగే నష్టాన్ని వివరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సిపిఎం గెలిస్తే ఈ ప్రాంత పేదలు, గిరిజనుల పక్షాన నిలుస్తుందన్నారు. సిపిఎం రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి పాలకులే కారణమన్నారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు షేక్‌ మహ్మద్‌ ఆలీ మాట్లాడుతూ.. సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వారినే గెలిపించుకోవా లని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు సిహెచ్‌.సతీష్‌, జర్తా లక్ష్మి, భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభకు ముందు రాజవొమ్మంగి పురవీధుల్లో ఇండియా బ్లాక్‌ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

➡️