Polavaram: డయాఫ్రం వాల్‌ క్షుణ్ణంగా పరిశీలన

  •  ‘పోలవరం’లో అంతర్జాతీయ నిపుణుల బృందం బిజిబిజీ
  •  దెబ్బతిన్న పనులు రెండో రోజూ పరిశీలన
  •  నేడు కేంద్ర,రాష్ట్ర అధికారులతో సమీక్ష

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి, పోలవరం : పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రంవాల్‌ను అంతర్జాతీయ నిపుణుల బృందం సోమవారం క్షుణ్ణంగా పరిశీలించింది. ఇంజనీరింగ్‌ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు సభ్యుల బృందం రెండో రోజు సోమవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో బిజిబిజీగా గడిపింది. రాజమండ్రి నుంచి ఉదయం 9.30 గంటలకు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న బృందం సభ్యులు ఎగువ, దిగువ కాపర్‌ డ్యామ్‌ కాంఫ్రహెన్షన్‌ పనులను, దెబ్బతిన్న డయా ఫ్రంవాల్‌, గైడ్‌బండ్‌, ఇసిఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన మ్యాప్‌ పాయింట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ వరదలకు మూడు, నాలుగు చోట్ల దెబ్బతినడంతో ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గతంలో డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి రూ.450 కోట్లు వరకూ ఖర్చయితే, మళ్లీ పున:నిర్మాణానికి రూ.900 కోట్లకుపైగా ఖర్చు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. డయాఫ్రం వాల్‌ను మళ్లీ పూర్తి స్థాయిలో నిర్మించాలా? లేక దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు చేస్తే సరిపోతుందా? అనే విషయంపై సందిగ్ధత ఏర్పడింది. డయాఫ్రం వాల్‌ నిర్మాణంలోనే ప్రాజెక్టుకు గుండెకాయ వంటి ఇసిఆర్‌ఎఫ్‌ నిర్మాణం జరగాల్సి ఉంది. దీంతో డయాఫ్రం వాల్‌ నిర్మాణంపై ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై తేల్చేందుకే అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని రప్పించారు. కమిటీ రెండు రోజులుగా ప్రాజెక్టు పనులను నిశితంగా పరిశీలించింది. కాఫర్‌ డ్యాం సీపేజ్‌ నుంచి వస్తున్న వాటర్‌ పనులు, దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌, ఇసిఆర్‌ఎఫ్‌ గ్యాప్‌-2 పనులు, దెబ్బతిన్న గైడ్‌బండ్‌ పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించింది. ప్రాజెక్టు పనుల పరిశీలన పూర్తవడంతో మూడో రోజు మంగళవారం అధికారులతో సమావేశం కానుంది. రెండో రోజు ప్రాజెక్టు సందర్శనలో అంతర్జాతీయ నిపుణులు డేవిడ్‌ బి.పాల్‌, రిచర్డ్‌ డాన్నిలీ, గెయిన్‌ ఫ్రాన్‌కో డి కికో, సీన్‌ హించ్‌బర్గర్‌, పోలవరం ప్రాజెక్టు సిఇ నరసింహమూర్తి, ఇఇ మల్లికార్జునరావు, ప్రాజెక్టు గౌరవ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, సిడబ్ల్యుసి డిప్యూటీ డైరెక్టర్‌ అశ్వినీకుమార్‌, ఇంజనీరింగ్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️