నేటి నుంచి టెట్‌ అభ్యర్థులకు ఎడిట్‌ ఆప్షన్‌

Apr 11,2024 13:01 #Edit option, #TET candidates

హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20 వరకు పెంచింది. దీంతోపాటు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు (ఎడిట్‌ ఆప్షన్‌) ఈ నెల 11 నుంచి 20 వరకు అవకాశం కల్పించింది. టెట్‌ దరఖాస్తులకు గతంలో నిర్దేశించిన గడువు బుధవారంతో ముగిసింది. మంగళవారం నాటికి 1,93,135 దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరం సెప్టెంబరులో నిర్వహించిన ఈ పరీక్షకు 2.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంతో పోల్చితే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గడంతో ప్రభుత్వం అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేందుకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల 20 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 2.50 లక్షల మంది టెట్‌లో అర్హత పొందారు. ఉపాధ్యాయ కొలువు ఎంపికలకు నిర్వహించే డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో కొత్తగా డీఈడీ, బీఈడీ పాసైన అభ్యర్థులతో పాటు గతంలో టెట్‌పాసైన వారు సైతం మార్కులు పెంచుకునేందుకు మళ్లీ మళ్లీ ఈ పరీక్ష రాస్తున్నారు.

➡️