నియంతృత్వ పోకడలతో విద్యారంగం నిర్వీర్యం: మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

Jan 28,2024 17:04 #ex mlc, #Kathi Narasimha Reddy

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్ : కార్పొరేట్ రంగానికి కొమ్ముకాసి,ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే పాలకులకు ఉద్యమాలతోనే సమాధానం చెప్తామని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక ఉన్నత పాఠశాలలో ఎస్.టి.యు జిల్లా కౌన్సిల్ సమావేశం దేవరాజులురెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. వేలకోట్ల ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలలను ఉద్దరించామని చెబుతున్న పెద్దలు, ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమాన్ని విస్మరించి, ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం సరికాదని విమర్శించారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు,తెలుగు మాధ్యమం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉత్తుత్తి పి.ఆర్.సి కమిటీల పేరుతో మభ్యపెట్టడం మానుకోవాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్ లకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ టీచర్లకు ఇప్పటివరకు సర్వీస్ రూల్స్ అమలు చేయలేకపోవడం దారుణమని విమర్శించారు. సమగ్ర శిక్ష,కస్తూర్బా,ఆదర్శ పాఠశాలల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి ముందు, సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశాల్లో ఎస్టియు రాష్ట్ర నాయకులు గాజుల నాగేశ్వరరావు,రఘునాథ రెడ్డి, గంటా మోహన్, పురుషోత్తం, హేమచంద్ర రెడ్డి,లోకనాధ్ రెడ్డి,మదన్ మోహన్ రెడ్డి,గురు కుమార్, బాల గంగిరెడ్డి, బోడే మోహన్, సంగమేశ్వర రెడ్డి,ఇలియాస్ భాషా ,జనార్ధన్ రెడ్డి, జయరామప్ప ,సుమతి,రాదా కుమారి,పవన్,యువరాజ్, కోదండయ్య,నరేంద్ర తదితరులు తో పాటు, పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు,నాయకులు పాల్గొన్నారు.

➡️