రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలివి

Apr 6,2024 23:33 #ap cm jagan, #Nellore District

-గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆలోచించి ఓటేయాలి
-కావలి ‘మేమంతా సిద్ధం’ సభలో జగన్‌
-నెల్లూరు జిల్లాలో రోడ్‌ షో
ప్రజాశక్తి- కావలి (నెల్లూరు జిల్లా) :ప్రస్తుత ఎన్నికల యుద్ధంలో పేదల పక్షాన మీ బిడ్డ ఒక్కడే ఒక పక్షాన నిలబడితే, మరో పక్షాన మోసగాడు చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌, ప్రధాని మోడీ నిలబడ్డారని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టిన మరో జాతీయ పార్టీ వీరితో కలిసి మీ బిడ్డకు వ్యతిరేకంగా చేస్తోందని విమర్శించారు. ఇది ఎంఎల్‌ఎలు, ఎంపిలను ఎన్నుకునే ఎన్నికలు కావని, రాష్ట్రంలోని పేదలు, అక్కా, చెల్లెమ్మలు, అవ్వ, తాతలు భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలని పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. చంద్రబాబూ… పేదలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నావా? అని ప్రశ్నించారు. శనివారం నెల్లూరు జిల్లాలో జగన్‌ రోడ్‌ షో నిర్వహించారు. నెల్లూరు నగరం నుంచి కోవూరు జంక్షన్‌, సున్నపుబట్టి, కావలి తదితర ప్రాంతాల్లో రోడ్‌ షో పూర్తి చేసుకొని కావలి పట్టణంలో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ ఆత్మగౌరవాన్ని, విశ్వసనీయతను గెలిపించేందుకు మీరంతా సిద్ధమేనా? అని ప్రజలను అడిగారు. మోసం, అబద్ధాలు, కుట్రలు అన్ని కలగలిపిన క్యారెక్టరే చంద్రబాబు అని దుయ్యబట్టారు. 14 ఏళ్లు సిఎంగా పనిచేశానని చెప్పుకుంటున్న ఆయన ఎన్నికలకు ముందు మేనిఫెస్టో పేరుతో రంగురంగుల కాగితాలు పంచారని, గెలిచాక ఏ ఒక్క హామీనైనా నెరవేర్చలేదని విమర్శించారు. 2014లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చానని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. తాను అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు జవాబు చెప్పలేక నోటికి ఫెవికాల్‌ రాసుకున్నారని విమర్శించారు. ప్రజల వద్దకు వచ్చి ఓటు అడిగే ముందు ‘నేను మీకు ఈ పనులు చేశాను. నాకు ఓట్లు వేయండి’ అని కాకుండా మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా పులి-బంగారు కడియం కథను జగన్‌ ఉదాహరించారు. ‘కేజీ బంగారం ఇస్తా, బెంజ్‌ కారు ఇస్తా! సూపర్‌ సిక్స్‌ ఇస్తా! సూపర్‌ 7 ఇస్తా! అంటూ మోసగించాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేశామన్నారు. మీకు సంక్షేమం అందించేందుకు 130 సార్లు డిబిటి బటన్‌ నొక్కానన్నారు. మీరు నా కోసం రెండుసార్లు ఫ్యాన్‌ గుర్తుపై బటన్‌ నొక్కాలని కోరారు. ఒక్కసారి గెలిపిస్తేనే 58 నెలల్లో 2 లక్షలా 71 వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని మీ ఇంటి ముందుకే తెచ్చి ఇచ్చానని వివరించారు. చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లేనన్నారు. అనంతరం సింగరాయకొండ నుంచి కందుకూరు చేరుకున్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్లనున్నారు.

➡️