ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి

May 7,2024 22:00 #elections, #Peacefully

– డిజిపిని కలిసి వినతిపత్రం అందజేసిన సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లు చూడాలని, నిజాయతీతో ప్రజాస్వామ్యహితంగా పోలీస్‌ యంత్రాంగాన్ని నడిపించాలని డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తాను సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కోరారు. మంగళవారం డిజిపిని కలిసిన వారు వివిధ అంశాలపై వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్రంలోని పెనమలూరు, మచిలీపట్నంలో దళితులపై జరిగిన దాడులను డిజిపి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సీనియర్‌ ఐఎఎస్‌, ఐపిఎస్‌ రిటైర్డ్‌ అధికారులు 13 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల నిఘా వేదికగా ఏర్పడి, సమన్వయకర్తలుగా ఉండి క్షేత్రస్థాయిలో ఎన్నికల అక్రమాలను నివారించటానికి కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికల నిఘా వేదిక ‘ఎపిఎలక్షన్స్‌.కమ్‌’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించామని తెలిపారు. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ వెబ్‌సైట్‌ను వినియోగించుకుని ఎన్నికలు సక్రమంగా జరిగేటట్లు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మాజీ మేయర్‌ జంద్యాల రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️